ఒక్క మాట.. ఒకే ఒక్క మాట .. భారత్‌కు అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెస్తోంది. లోకల్‌గా జనం మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పంట పండించుకోవడానికి గతంలో చాలా సార్లు అలాంటి మాటలు మాట్లాడి ఉంటారు కానీ.. ఈ సారి అది అంతర్జాతీయ అంశం అయిపోయింది. పలు దేశాలు తమ ప్రవక్తను అవమానించారని ఆరోపిస్తూ.. మేడిన్ ఇండియా అని కనిపిస్తే అమ్మకాలను బ్యాన్ చేస్తున్నాయి. ఖతర్ దేశంలో పెద్ద ఎత్తున ఉత్పత్తులను సూపర్ మార్కెట్ల నుంచి తొలగించి పక్కన పడేశారు.
ఇతర దేశాల్లోనూ అదే పరిస్థితి ఉంది. నుపుర్ శర్మ , నవీన్ కుమార్ అనే ఇద్దరు నోరు చేసుకునే బీజేపీ నేతల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వారు ఆ మాటలన్న తర్వాతచాలా మంది సమర్ధిస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఊహించని విధంగా విదేశాల నుంచి రియాక్షన్ వచ్చింది. దీంతో తప్పు దిద్దుకునేందుకు అన్నట్లుగా వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆహిష్కరణను ఎవరూ నమ్మడం లేదు.
అంతర్గతంగా చేయాల్సిన రాజకీయాలను అంతర్జాతీయం చేసి ఇప్పుడు మేడిన్ ఇండియా ఉత్పత్తులపై ప్రభావం పడే స్థాయికి తీసుకు వచ్చారు. ఆ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసి.. చమురును భారత్‌కు దిగుమతి చేయడం నిలిపివేస్తే ఇండియాలో చమురు సంక్షోభం ఏర్పడుతుంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకూ బీజేపీ ప్రభుత్వ మాటల్ని ఆయా దేశాలు వింటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయా దేశాలకు ఎగుమతులపై కీలక ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.