వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరో టీడీపీ ఎమ్మెల్యే చిక్కినట్లుగా కనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారో.. ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారో తెలియదు కానీ.. ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. రాజధాని విషయంలో… గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేను పార్టీ వైపు ఆకర్షించడం ద్వారా.. అలాంటిదేమీ లేదని.. సందేశం ఇచ్చేందుకు జగన్‌తో ఎమ్మెల్యే గిరి భేటీ అంశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటోంది. వ్యాపారవేత్త అయిన మద్దాలి గిరి 2014లో ఆర్యవైశ్య కోటా కింద గుంటూరు తూర్పు టిక్కెట్ పొందారు.
గత ఎన్నికల్లో ఆయనకు గుంటూరు పశ్చిమ టిక్కెట్ ను.. చంద్రబాబు కేటాయించారు. గుంటూరు పశ్చిమకు.. గతంలో ఎప్పుడూ… వైశ్య సామాజికవర్గానికి కేటాయించలేదు. కానీ.. పార్టీ కోసం పని చేశారన్న కారణంతో చంద్రబాబు ఆయనకు టిక్కెట్ కేటాయించారు. ఎంపీ గల్లా జయదేవ్ సాయంతో.. ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. అనేక మంది పోటీ దారులున్నప్పటికీ.. అందరూ.. టిక్కెట్ దక్కించుకున్న మద్దాలి గిరికి అనుకూలంగా పని చేసి గెలిపించారు. కొద్ది రోజుల పాటు.. టీడీపీ తరపున చురుగ్గా ఉన్న గిరి.. హఠాత్తుగా.. వైసీపీతో టచ్ లోకి వెళ్లారు. టీడీపీ తరపున తరచూ ప్రెస్ మీట్లు పెట్టి.. అధికార పార్టీపై ఎదురుదాడి చేసిన మద్దాలి గిరి అనూహ్యంగా ఎందుకు వైసీపీ వైపు చూశారన్నది చర్చనీయాంశంగా మారింది.
సహజంగా వ్యాపారవేత్త అయిన మద్దాలి గిరి.. వ్యాపారాల విషయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చని.. భావిస్తున్నారు. మొత్తానికి.. గన్నవరం ఎమ్మెల్యే ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిని కలిసి.. నేరుగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక సభ్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మద్దాలి గిరి.. సీఎంను కలిశారు. ఆయన బహిరంగంగా స్పందిస్తేనే.. అసలు విషయం తేలుతుంది.