హైదరాబాద్ లోని కూకట్ పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాధవరం కృష్ణరావు పర్యటించారు. తుఫాను బాధితులకు వెయ్యి ప్యాకెట్ల బియ్యం, బట్టలు, దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు.అంజనేయపురం, పాలెం గ్రామాల్లో కృష్ణారావు బాధితుల సమస్యలు ఆడిగితెలుసుకున్నారు. సిక్కోలు వాసులు కష్టజీవులని, అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు తనవంతు సహాయం చేయటానికి వచ్చానని చెప్పుకొస్తున్నారు. కృష్ణారావు… తుపాను బాధితులకు కొంత సహాయ సామాగ్రి తీసుకుని ఉన్న పళంగా శ్రీకాకుళం రావడానికి ప్రధానమైన కారణం.. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే.
పార్టీ అధినేత కేసీఆర్… ఒక్క రోజు కూడా వదలి పెట్టకుండా ప్రచారం చేయమన్నారు కాబట్టి.. కృష్ణారావు దాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు దాదాపుగా నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తూ ఉంటారు వారి కుటుంబీకులకు ఆకట్టుకునేందుకే… కృష్ణారావు.. ప్రచారం కోసం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడి.. టీఆర్ఎస్ లో చేరేటప్పుడే.. కృష్ణారావు తన ప్రధాన డిమాండ్ ను… ఉత్తరాంధ్ర ప్రజలకు చెందినదిగానే.. కేసీఆర్ కు చెప్పానని.. దాన్ని పరిష్కరిస్తానన్నారని చెప్పుకొచ్చారు. అదే .. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను… బీసీ జాబితాలో చేర్చడం. అంతకు ముందు బీసీ జాబితాలోనే ఉండేవి.. కానీ కేసీఆర్ తెలంగాణ సీఎం అవగానే.. ఆ కులాలు తెలంగాణలో లేవని… అవి ఉత్తరాంధ్ర కులాలని.. బీసీ జాబితా నుంచి తొలగించారు.
దాంతో… హైదరాబాద్ లో స్థిరపడిన ఉత్తరాంధ్ర వాసులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ ఆ కులాలను బీసీల్లో చేర్చుతారనే తాను.. టీఆర్ఎస్ లో చేరానని చెప్పుకున్న కృష్ణారావు… ఇంత వరకూ ఆ పని చేయించలేకపోయారు. దీంతో ఆయనపై అసంతృప్తి ఉంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలోనే.. శ్రీకాకుళం జిల్లా తుపాను బాధితులకు పరామర్శకు వెళ్లారు. మరి ఫలితాన్ని ఇస్తుందో లేదో..!