హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ ను చుట్టేస్తున్నా ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.
తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ప్రకటించారు మాధవీలత. స్థిరచరాస్తులన్నీకలిపి 218కోట్లు అని పేర్కొన్నారు. చరాస్తుల విలువ 165.46కోట్లు …స్థిరాస్తుల విలువ 55.92 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. అలాగే, 27.03కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు.
విరించి లిమిటెడ్ లో తన పేరిట 8.92 కోట్ల విలువైన షేర్లు, మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తెలిపారు. అన్ లిస్టెడ్ కంపెనీలైన పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్,గజ్వేల్ డెవలపర్స్ లో తన పేరిట రూ. 16.27 కోట్ల షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన పేరిట వ్యవసాయ భూములు, వాహనాలు ఏమి లేవన్నారు. తన పేరిట ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో మాధవీలత పేర్కొన్నారు.