సుశాంత్ ఆత్మహత్య కేసులో ప్రస్తుతం బాలీవుడ్లో డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. ఈ అంశాన్ని టాలీవుడ్‌కు ముడి పెట్టేందుకు కొంత మంది అప్పుడే బయలుదేరారు. ఇలాంటి వారిలో మాజీ హీరోయిన్ మాధవీలత ముందు ఉన్నారు. టాలీవుడ్లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవంటూ..మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ తర్వాత టీవీ చానళ్ల డిబేట్లకు వెళ్తున్నారు. అందులో టాలీవుడ్లో ఎక్కడెక్కడ డ్రగ్స్ వాడతారో.. ఎలా వాడతారో కూడా ఆమె వివరంగా చెప్పడం ప్రారంభించారు. ఈమె హడావుడి చూసి… పోలీసులకు కూడా అనుమానం వచ్చినట్లుగా ఉంది. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలుంటే ఇవ్వాలని సమాచారం పంపారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశామని.. మరికొంతమంది మా నిఘాలో ఉన్నారని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
వివాదాలతో పబ్లిసిటీ తెచ్చుకోవడం ఎలానో ఒకరిని చూసి ఒకరు బాగా నేర్చుకుంటున్నారు. బాలీవుడ్లో కంగనా రనౌత్.. ఈ విషయంలో ముందున్నారు. ఏ వివాదం వచ్చినా.. అందులో బాలీవుడ్ మాఫియా హస్తం ఉందని..తనకు అన్నీ వివరాలు తెలసని ప్రకటనలు చేస్తూ హంగామా సృష్టిస్తూంటారు. మొదట సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి వెలుగులోకి వస్తున్న ప్రతి విషయంలోనూ… అదే కారణం అని చెబుతూ వస్తున్నారు. మొదట అవకాశాలు రాకుండా చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని.. నెపోటిజం మీద ఉద్యమం చేశారు. తర్వాత హత్య అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు డ్రగ్స్ కోణం బయటకు వస్తే అదే కారణం అంటున్నారు. ఈ తరహాలోనే టాలీవుడ్లో మాధవీలత తయారయ్యారు.
సినీ పరిశ్రమలో ఎదిగి… ఆ సినిమా పరిశ్రమపైనే ఏదో ఒకటి మాట్లాడితేతత కాస్త పబ్లిసిటీ వస్తుందని అనుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అది బాలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ అలాంటి సంస్కృతి వస్తోంది. ఏదో ఒక ఆరోపణచేసి.. తాము లైమ్‌లైట్‌లో ఉంటే సరిపోతుంది..ఎవరేమనుకుంటే మాకెందుకు అన్నట్లుగా పరిస్థితి మారింది.