శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నటి మాధవీలత కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో మౌన దీక్షని చేపట్టింది. ఉదయం సరిగ్గా 10 గంటలకు నల్ల బ్యాడ్జి కట్టుకున్న మాధవీలత దీక్షకు కూర్చుంటే ఆమెతో పాటు మరికొద్ది మంది ఈ నిరసన దీక్షలో తోడయ్యారు. అయితే దీక్షలో కూర్చున్న కొద్దిసేపటికే బంజారా హిల్స్ పోలీసులు ఫిల్మ్ ఛాంబర్ దగ్గరకు చేరుకుని దీక్షని భగ్నం చేశారు. ఆమెను అక్కడి నుంచి లేచి వెళ్లిపోమని కోరినా, మాధవీలత వినకపోయే సరికి.. ఆమెను బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ”దీక్షలో ఎలాంటి గొడవలూ జరగవు. ఇది కాస్టింగ్ కౌచ్‌కి నిరసనగా చేస్తున్న దీక్ష మాత్రమే. ఒకవేళ గొడవ జరిగితే.. దీక్ష ఆపేస్తా. కనీసం పోలీస్ స్టేషన్లో అయినా దీక్ష చేసుకోనివ్వండి” అని మాధవీలత పోలీసుల్ని అభ్యర్థించారు. కానీ పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా మాధవీలతని బలవంతంగా దీక్ష విరమింపచేయించి, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.