టీఆర్ఎస్ నేత , ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్… సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజుతో కలిసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని… కాంగ్రెస్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. తేజారాజు భార్య కాల్ హెల్త్ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతారని.. ఆ కంపెనీ ద్వారా… కేటీఆర్ అక్రమ సంపాదనను.. విదేశాలకు తరలించి.. అక్కడ పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని…కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని విమర్శించారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని.. కేటీఆర్ అక్రమాస్తులు నిరూపించేందుకు సిద్ధమని మధు యాష్కీ సవాల్ చేశారు. అక్రమాస్తులపై ప్రజలు తిరగబడతారన్న భయంతో… బాత్రూమ్లను కూడా బుల్లెట్‌ప్రూఫ్‌తో నిర్మించుకున్నారని మండిపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమా? ..4కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తా..? ప్రజలు తేల్చుకోవాలని యాష్కీ పిలుపునిచ్చారు. 2001లో రూ.10లక్షలున్న కేసీఆర్ ఆస్తి… ఇప్పుడెంత?: కేటీఆర్ ఆస్తి 2009లో రూ.కోటి, 2014లో రూ.41కోట్లా? అని ప్రశ్నించారు. మలేసియా, యూఎస్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. అన్నింటినీ రుజువు చేస్తామన్నారు. బెంగళూరులో కేటీఆర్‌కు బినామీలున్నారని మధుయాష్కీ ఆరోపించారు. డాలర్ కాలనీలో కవితకు విల్లా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకునేందుకే ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అక్రమార్జనను ఇక ప్రతిరోజు వివరిస్తానని ప్రకటించారు.
ఆదివారం ప్రెస్మీట్లో కవిత అక్రమాస్తులను ప్రకటిస్తానన్నారు. హవాయి చెప్పుల హరీశ్‌రావు బండారాన్ని బయటపెడతానని ప్రకటించారు.కేసీఆర్ బతుకేంటో తెలంగాణ ప్రజలకు తెలుసని …దుబాయ్ శేఖర్, శేఖర్‌మామగా కేసీఆర్ ఎదిగారన్నారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్రావన్నారు. కేటీఆర్ .. భీమవరం రాజుల గురించి తరచూ చెబుతూంటారు. వారితో తనకెంతో… సాన్నిహిత్యం ఉందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మధుయాష్కీ చెప్పిన వివరాలు చూస్తే.. ఆ భీమవరం రాజులు.. సత్యం రామలింగరాజు కుటుంబీకులేనని రాజకీయవర్గాలు అంచనా వేయడం ప్రారంభించాయి.