తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్లో కాకుండా హైదరాబాద్ శివారులో ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ టిక్కెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. హైకమాండ్ వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉండటంతో టిక్కెట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు.కానీ ఆయనకు ఎల్బీనగర్ నేతల నుంచి సెగ ఎదురవుతోంది.
ఎల్బీ నగర్ నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి, మరో సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిలు మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ అభ్యర్ధిత్వాన్ని పక్కకు పెట్టాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నియోజకవర్గంలో మొదటి నుండి పని చేస్తున్న తమను కాదని బయటి వ్యక్తులకు టికెట్ ఇస్తే పార్టీ గెలవదని చెబుతున్నారు. కానీ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నరేవంత్ రెడ్డి కూడా మధుయాష్కీకి మద్దతుగా ఉన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉంటారు. అందుకే.. మధుయాష్కీ ఇటీవల చంద్రబాబు అరెస్టును ఖండించారు. కేసీఆర్, మోదీ కలిసి అరెస్టు చేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికే పోటీ పడి ఇలా చేస్తున్నారని అంటున్నారు.