టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ హెడ్ ఆఫీసును ఈడీ జప్తు చేసింది. ఆయనతో పాటు ఆయన కంపెనీలకు చెందిన రూ. 80 కోట్లకుపైగా స్థిర, చరాస్తులను జప్తు చేశారు. ఇందులో మధుకాన్ ఆఫీస్‌తో పాటు కొన్ని కీలకమైన ఆస్తులున్నాయి. మధుకాన్ సంస్థ దేశంలో వివిధ ప్రాంతాల్లో రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు చేస్తుంది. అందులో భాగంగా రాంచీ ఎక్స్‌ప్రెస్ వే ను కూడా నిర్మించేందుకు కాంట్రాక్ట్ పొందింది.
ఈ కాంట్రాక్ట్‌ను చూపించి బ్యాంకుల వద్ద మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించారు. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. బ్యాంకుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అప్పట్లో సైలెంట్ అయిపోయిన ఈడీ ఇప్పుడు హఠాత్తుగా అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఏదో సిగ్నల్ పంపారనే అభిప్రాయం వినిపిస్తోంది.
నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ బడా కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నో కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఆ సంస్థ పూర్తిగా వెనుకబడిపోయింది. రుణాల ఎగవేత సమస్యలు ఎదుర్కొంటోంది. తాజాగా హెడ్ ఆఫీసును కూడా కోల్పోవాల్సి వచ్చింది.