నిర్మాత మధుర శ్రీధర్ రివ్యూలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. `దొరసాని`కి ఆయనే నిర్మాత. ఈ సినిమాపై డివైడ్ టాక్ నడుస్తోంది. విశ్లేషకులు ఈ సినిమాలో ఏం లేదని తేల్చేశారు. హీరో మైనస్ అని, కథ రొటీన్ అని, సైరత్నే మళ్లీ తీశారని కామెంట్లు చేశారు. ఇవన్నీ మధుర శ్రీధర్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాయి, దాంతో ఆయన మీడియా సాక్షిగా రివ్యూలపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈనాటి సినిమా రివ్యూవర్స్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మధర శ్రీధర్ రెడ్డి.
”మేం ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలా, రివ్యూవర్స్ కోసం సినిమాలు తీయాలా? అనేది అర్థం కావడం లేదు. పెద్ద హీరోలతో కోట్లు కోట్లు పెట్టి కమర్షియల్ సినిమాలు తీసే స్థోమత చిన్న సినిమాలకు ఉండడం లేదు. మాకు కొత్త కథలే దిక్కు. దానికీ ప్రోత్సాహం అందకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆనంద్ దేవరకొండని సైతం విమర్శిస్తున్నారు. కథ బాగుంది గానీ నటీనటులు తేలిపోయారని వ్యాఖ్యానించారు. ఆనంద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఓ సీన్లో నగ్నంగానూ నటించాడు. అలాంటి ధైర్యం ఉన్న నటుడిని నేను పదేళ్లుగా చూడలేదు. అలాంటి ఆనంద్ని విమర్శించడం కూడా బాధించింది” అని చెప్పుకొచ్చారు మధుర శ్రీధర్ రెడ్డి.