హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులకు నిన్న ఒక విచిత్రమైన అనుభవం ఎదురయింది. టీడీపీ టిక్కెట్‌పై గెలిచి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వారు నిన్న స్పీకర్ మధుసూదనాచారిని కలిసిన సంగతి తెలిసిందే. అయితే చారిగారు ఆ విషయంపై మాట్లాడటానికి బదులు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును గురించి ఎత్తుకున్నారట. అన్న ఎన్టీఆర్‌ను పొగడ్తలలో ముంచెత్తారు. ఆ మహనీయుడిపై తాను రాసిన కవితను టీడీపీ నేతలకు చదివి వినిపించారు. ఎన్టీఆర్ పేరులోని ప్రతి అక్షరాన్ని ఉదహరిస్తూ ఆ కవితను అక్షరబద్ధం చేసినట్లు తెలిపారు. పైగా ఎన్టీఆర్‌పై ఇంతకంటే బాగా మరెవరూ కవిత రాయలేరనికూడా చెప్పారంట. ఎవరైనా ఇంకా బాగా రాస్తే వారికి లక్షా వేయి నూట పదహార్లు బహుమతిగా ఇస్తాననికూడా అన్నారు. తాము వచ్చిన పనేమిటి, ఈ కవితల గొడవేమిటంటూ తెలుగుదేశం జుట్టు పీక్కున్నారట.
అసలు తెలుగుదేశం నేతలు వచ్చిన పని మర్చిపోయేటట్లు చేయటానికే ఈ కవిత డ్రామానా, లేక నిజంగానే తెలుగుదేశం వ్యవస్థాపకుడైన అన్న నందమూరిపై మధుసూదనాచారికి అంత అభిమానం ఉందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమయింది.