ఏపీలో ఫైబర్ నెట్ ను టీడీపీ హయాంలో ప్రారంభించారు. 149 రూపాయలకే కేబుల్, ఇంటర్నెట్ , ఫోన్ సౌకర్యం కల్పించే ప్రాజెక్టు అది. రూ. 350 కోట్లతోనే అత్యధిక సామర్థ్యం ఉన్న నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఈ ఫైబర్ నెట్‌ను దోపిడీకి కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. ఎంతగా అంటే కనీసం బిల్లుల వసూలు లెక్కల్లేవు. తెచ్చిన అప్పులు ఎవరికి చెల్లించాలో లెక్కల్లేవు. ఈ ఫైబర్ నెట్ వ్యవహారాలు చూసి ఇతర అధికారులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. తవ్వాల్సింది చాలా ఉందని ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసి… హెడ్ క్వార్టర్ దాటి వెళ్లొద్దని ఆదేశించారు.
ప్రజాధనం సొంత ఖాతాలకు మళ్లింపు
ఫైబర్ నెట్ కనెక్షన్లు టీడీపీ ఉన్నప్పుడే లక్షల్లో ఉన్నాయి. వాటికి చార్జీలు వసూలు చేస్తారు. వైసీపీ వచ్చాక చార్జీలను పెంచారు. మరి డబ్బులన్నీ సంస్థ ఖాతాలో పడ్డాయా అంటే… ఎక్కడా లెక్కల్లేవు. ఏమయ్యాయి అంటే ఎవరూ మాట్లాడటం లేదు. మామూలుగా ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా కేబుల్ ఆపరేటర్ల ద్వారా నడుస్తాయి. వారే డబ్బులు చెల్లిస్తారు. వైసీపీ హయాంలో ఈ చెల్లింపులు నగదు రూపంలో జరగడంతో సొంత ఖాతాలకు మళ్లిపోయాయని అధికారులుగుర్తించారు.
అప్పులు తెచ్చి ఇష్టారాజ్యంగా మళ్లింపు
వైసీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు ఫైబర్ నెట్ పేరుతో 1250 కోట్ల అప్పులు తెచ్చారు. అవి ఎవరికి చెల్లించారో.. వారు ఏం పనులు చేశారో రికార్డులు లేవు. కమిషన్లు తీసుకుని అందరికీ చెల్లించినట్లుగా తెలింది. కొన్ని నిధులు ప్రైవేటు ఖాతాలకు మళ్లిపోయాయి. ఇటీవల ఫైబర్ నెట్ పై సీఎం రివ్యూ చేస్తే ఆదాయ , వ్యయాలు… అప్పులు, చెల్లింపులపై వివరాలు చెప్పమంటే చెప్పలేకపోయారు.
వైసీపీ కార్యకర్తల పునరావాస కేంద్రం
డిజిటల్ కార్పొరేషన్ తో పాటు… ఫైబర్ నెట్ ను కూడా వైసీపీ కార్యకర్తల పునరావాస కేంద్రంగా మార్చారు. టీడీపీ హయాంలో నెల జీతాల బిల్లు రూ. ఏడు కోట్లు ఉండేది.. కానీ వైసీపీ వచ్చాక దాన్ని 48 కోట్లకు పెంచారు. అంత మందితో ఏం ప నులు చేయించుకున్నారో ఎవరికీ తెలియదు. ఇద్దరే పూర్తి స్థాయి ఉద్యోగులు ఉంటే… 1200 మంది తాత్కలిక ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రజా సొమ్ము దిగమింగడానికి నియమితులైన వారే తప్ప… పనులు చేసేందుకు కాదు.
దోచేసుకున్న మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి ఫ్యామిలీ
రైల్వేలో పని చేస్తున్న మధుసూదన్ రెడ్డి జగన్ గెలవగానే డిప్యూటేషన్ పై ఏపీలో వాలిపోయారు. ఫైబర్ నెట్లో తవ్వుకోవడం ప్రారంభించారు. తన బంధువులు మొత్తాన్ని ఇందులోకి చేర్చేశారు. పన్నెండు వందల మంది సిబ్బంది ఉన్నా.. నిర్వహణ పనులంటూ తన సోదరుడి సంస్థకు కాంట్రాక్ట్ ఏటా పన్నెండు కోట్లు కొట్టశారు. విచిత్రం ఏమిటంటే… అసలు లావాదేవీలన్నీ.. ఎక్కడా ఆన్ లైన్ లో ఉండకుండా కేవలం ఫైళ్లలోనే ఉండేలా చూసుకున్నారు. ఆ ఫైళ్లు కొన్నింటిని చించేశారు. అవి లేకపోవడం కూడా మధుసూదన్ రెడ్డిని మరింత ముంచబోతోంది.
రికవరీ చేస్తారా ?
ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డి దోపిడీ నిరంతరాయంగా జరిగింది. ఆధారాలతో సహా ఉన్నాయి. సస్పెన్షన్ వేటు వేశారు. రేపోమాపో అరెస్టు చేశారు. కానీ ప్రజాధనాన్ని ఎలా రికవరీ చేస్తారన్నదే కీలకం.