మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మూడు సార్లు బీజేపీ వరుసగా గెలిచింది. పదిహేనేళ్లుగా అధికారంలో ఉంది. ఇప్పుడు నాలుగో సారి కూడా… ఎంత అధికార వ్యతిరేకత ఉన్నా.. రేసులోనే ఉందని.. బీజేపీ అనుకూల చానళ్లు సర్వేలు విడుదల చేస్తున్నాయి. కానీ.. అసలు విషయం మాత్రం.. అక్కడ అంత లేదని చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులయిన మంత్రులు.. టిక్కెట్లు ప్రకటించిన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటిస్తున్నారు. సీఎం చౌహాన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎస్పీ మీనా పోటీ చేయడం లేదని ప్రకటించారు. మరో నలుగురు మంత్రులు కూడా.. పోటీ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు హైకమాండ్‌కు తెలిపారు. అయితే.. వారిని సీఎం బుజ్జగిస్తున్నారట. మూడు రోజుల కిందటే…ఓ బీజేపీ ఎమ్మెల్యే.. టిక్కెట్ కు ఢోకా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
బీజేపీకి ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురు కావడని ప్రధాన కారణం… ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ చేసిన సర్వేనే. అక్టోబర్ 30న ముఖ్యమంత్రి చౌహాన్‌కు ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు సమర్పించిన రహస్య నివేదిక బీజేపీలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్ధానాల్లో 128 స్ధానాల్లో పాలక బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. బీజేపీ కేవలం 92 సీట్లలోనే గెలుపొందే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది.మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆరు సీట్లలో, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ మూడు సీట్లలో విజయం సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. పది మంది మంత్రులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అతితక్కువగా ఉన్నాయని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను చూసే ఐదుగురు మంత్రులు పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చారు.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గ్వాలియర్ చంబల్ డివిజన్లోని 34 స్ధానాలకు గాను 24 స్ధానాల్లో కాంగ్రెస్ బీజేపీ ఏడు సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. వింధ్య ప్రాంతంలోని 30 స్ధానాల్లో కాంగ్రెస్ 18కి పద్దెనిమిది వస్తాయి. మహాకోశల్ ప్రాంతంలోని 38 స్ధానాల్లో కాంగ్రెస్ 22, బీజేపీ 13 వచ్చే అవకాశం ఉంది. రైతు ఆందోళనలు, పోలీసు కాల్పులతో అట్టుడికిన మాల్వా నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్ 34 , బీజేపీ 32 చోట్లగెలిచే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అంచనా వేసింది.