హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియామిర్జాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం మండిపడింది. ఏటా తాము నిర్వహించే స్పోర్ట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి ఆహ్వానిస్తే గొంతెమ్మ కోర్కెలు కోరిందని దుయ్యబట్టింది. ఆమె కారణంగా గత శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించామని మధ్యప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి యశోధర రాజే ఆరోపించారు. టెన్నిస్ స్టార్‌గా సానియా అంటే తనకు గౌరవముందని, అయితే ఆమె కోర్కెలు అన్యాయంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమానికి హాజరు కావటానికి సానియా ఆమోదం తెలిపిన తర్వాత ఆమె పర్సనల్ అసిస్టెంట్ ఫోన్ చేసి, ఈ కార్యక్రమానికి రావటానికి సానియాకు రానూ-పోనూ ఛార్టర్డ్ ఫ్లైట్, రు.75,000 విలువైన మేకప్ కిట్, తన సహాయకులకోసం 5 బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలని కోరినట్లు తెలిపారు. అయితే నగదుగా ఎంత కోరిందీ యశోధర చెప్పలేదు. తాము సాధారణంగా ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్, స్టార్ హోటల్లో వసతి, స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సానియా కోరికలు ఆమోదయోగ్యంగా లేకపోవటంతో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ఆహ్వానించామని, ఆయన సంతోషంగా అంగీకరించి కార్యక్రమానికి హాజరయ్యారని వెల్లడించారు. గతంలో సైనా నెహ్వాల్ కూడా ఇదే సౌకర్యాలతో తమ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. మరోవైపు సానియా మిర్జా ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు.