వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడనని.. జగన్ పై పెట్టిన కేసులు అక్రమం అంటూ.. రాజకీయ నాయకుడి స్టైల్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ప్రస్తుతం కేటాయించిన పోస్టు నుంచి కూడా బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. నిన్నామొన్నటి వరకు ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండేవారు. అయితే.. ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని.. సంస్థకు నష్టం చేకూరుస్తూండటం.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తూండటంతో.. ప్రభుత్వం.. ఈ తలనొప్పి అంతా ఎందుకని… ఆరు నెలలకే ఆయనపై బదిలీ వేటు వేసింది. ప్రాథాన్యత లేని పోస్టుకు పంపేసింది. దీంతో.. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి…ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ.. మాట్లాడారు.
తనకు వైఎస్ జయంతి సందర్భంగా విజయమ్మ కేక్ పంపారని.. తిని పండుకుని.. లేచే సరికి బదిలీ అయిపోయిందన్నారు. తాను శక్తివంచన లేకుండా పని చేశానని చెబుతూ.. గతంలో వైఎస్ హయాంలో ఎలా పని చేశానో కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో.. చాలా రాజకీయాలు మాట్లాడారు. జగన్ అక్రమాస్తుల కేసులపై మాట్లాడారు. చాలా మంది ఆయన కేసుల్లో ఇరుక్కున్నా… తాను బయటపడటానికి కారణం.. నిజాయితీనేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. జగన్ పై పెట్టినవి అక్రమకేసులేనని వాదించారు. మాదిరెడ్డి ప్రతాప్ ప్రెస్‌మీట్ ప్రభుత్వ వర్గాల్లోనూ కలకలం రేపింది. విధేయత చూపిస్తున్నట్లుగా మాట్లాడి.. ఇమేజ్ను డ్యామేజ్ చేశారన్న అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
ఆయన ప్రెస్‌మీట్ పెట్టడం.. సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని తేల్చి..ఆయనకు ఇచ్చిన అప్రాధాన్య శాఖ నుంచి కూడా తొలగించి.. జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. కోడ్ ఆఫ్ కాండక్టుకు విరుద్దంగా వ్యవహరించారని.. షోకాజ్ నోటీసుకు ఏడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. వైఎస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకునే మాదిరెడ్డి ప్రతాప్.. వైసీపీ అధికారంలోకి రాగానే.. ఏపీఐఐసీ ఎండీ పోస్టు.. ఆర్టీసీ ఎండీ పోస్టుల్లాంటివి పొందిన ఆయన… తన వివాదాస్పద తీరుతో.. చివరికి.. ఏ పోస్టింగ్ లేని స్థికికి వచ్చారని అధికారవర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.