బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకొన్న కోలీవుడ్ హీరో శింబుకి ఒక కష్టం తీరిందనుకొంటే మరో కొత్త కష్టం తరుముకొస్తోంది. బీప్ సాంగ్ ఆయనకి ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టిందో అంతకంటే చాలా ఎక్కువే కష్టాలు తెచ్చిపెడుతోంది. ఆ పాట మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఉండటంతో రాష్ట్రంలో పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో ఆయనపై పిర్యాదులు నమోదు అవుతున్నాయి.
అరెస్ట్ భయంతో ఆయన చాలా రోజులు పోలీసులకి దొరక్కుండా తప్పించుకొని తిరిగారు. ఆ కారణంగా ఆయన సినిమా కెరీర్ కూడా దెబ్బ తింది. చివరికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడంతో మళ్ళీ శింబు చాలా రోజుల తరువాత జనం మధ్యకి వచ్చేరు. కానీ ఆయనపై నేటికీ కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది కనుక కొత్తగా తనపై కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర డిజిపిని ఆదేశించాలని కోరుతూ శింబు మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. కానీ ఊహించని విధంగా ఆ పిటిషన్ న్ని హైకోర్టు తిరస్కరించడంతో శింబు షాక్కయ్యారు. ఒక వ్యక్తిపై ఎవరూ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టకూడదనే వెసులుబాటు మన చట్టాలలో లేవని చెపుతూ శింబు పిటిషన్ న్ని హైకోర్టు కొట్టివేసింది. అంటే ఒక కేసులో ముందస్తు బెయిలు పొందినప్పటికీ మళ్ళీ అదే కారణంతో వేరొక కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. ఒకే కారణంతో తనపై వేర్వేరు చోట్ల నమోదు అవుతున్న కేసులన్నిటినీ కలిపి విచారించాలని శింబు పిటిషన్ పెట్టికొని ఉంటే ఈ సమస్య ఎదురవదు కదా?