రజనీకాంత్ గుప్త దానాలు చేస్తూంటారని ఆయన అభిమానులు చెబుతూంటారు. బహిరంగంగా ఆయన దేనికీ పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే అప్పుడప్పుడూ.. ఆయన పిసినారితనంపై మాత్రం కథనాలు వస్తూంటాయి. వివిధ సందర్భాల్లో నటులు రూ. కోట్లలో విరాళిస్తూంటే… రజనీకాంత్ రూ. లక్షల్లోనే ఇస్తూంటారు. ఒక్కో సారి అదీ కూడా ఇవ్వరు. రజనీకి ప్రచారం ఇష్టం ఉండదని.. గుప్త దానాలు చేస్తూంటారని.. ఆయన అభిమానులు ప్రచారం చేస్తూంటారు. అయితే.. తాజాగా ఆయనకు రూ. ఆరున్నర లక్షల విషయంలో కోర్టు వార్నింగ్ ఇచ్చిన వ్యవహారం మరోసారి రజనీ పిసినారితనం విషయం చర్చకు వస్తోంది.
రజనీకాంత్‌కు చెన్నైలో రాఘవేంద్ర పేరుతో ఓ భారీ కల్యాణమండపం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అంత ఖరీదైన కల్యాణమండపానికి.. సహజంగానే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ దానికి తగ్గట్లుగా పన్ను వేస్తుంది. అలా ఆరు నెలలకు.. ఆ పన్ను రూ. ఆరున్నర లక్షల వరకూ అయింది. దాన్ని కట్టమని నోటీసులు పంపించారు. అయితే.. ఈ పన్ను వేయడం రజనీకాంత్‌కు నచ్చలేదు. ఆరు నెలల పాటు లాక్ డౌన్ విధించి…తన కల్యాణమండపానికి పన్ను విధిస్తారా.. అని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రజనీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తి రజనీ లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పి.. జరిమానా నుంచి రజనీ లాయర్ తప్పించుకున్నారు. ఆస్తి పన్ను విషయంలో ఒక్క రజనీకే కాదు.. ప్రజలందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి. మరి రజనీకాంత్ మాత్రం ఆరున్నర లక్షల పన్నుకే ఎందుకు హైకోర్టుకెళ్లారనేది చాలా మందికి అర్థం కాని విషయం. కొంత మంది రజనీ ఆర్థిక వ్యవహారాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఘటన చెబుతుందని.. అంటున్నారు.