ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి… తెలుగుదేశం పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయని రోజంటూ ఉండదు. కాకపోతే.. అన్నీ జనరలైజ్ చేసి ఆరోపణలు చేస్తూంటారు. ఇసుక దోచేస్తున్నారని మట్టిని తరలిస్తున్నారని… చెబుతూంటారు. కానీ స్పెసిఫిక్‌గా ఫలానా చోట… భూమి కొట్టేశారని… లేదా నిధులు నొక్కేశారని చెప్పడం అరుదు. అలా చెబితే… తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే.. ఆధారాలు చూపించాలంటూ.. ఎదురుదాడి ప్రారంభిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురయింది. ఆరోపణలు నిరూపించాలనే ఓ సవాల్ ఎదురయింది. అయితే.. మాములుగా ఎంపీ, ఎమ్మెల్యే అయితే.. పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదేమో..? కానీ ఈ సారి రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి రంగంలోకి దిగారు. జగన్‌కు సవాల్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. శనివారం సాయంత్రం గొల్లమామిడాడ అనే ఊరిలో ప్రసంగించారు. ఆ సమయంలో.. బిక్కవోలు మండలంలో ఎంపీ మాగంటి మరళీమోహన్ కోడలికి చెందిన సంస్థకు ప్రభుత్వం 32 ఎకరాలు కట్టబెట్టిందని ఆరోపించారు. అవన్నీ పేదల భూములన్నారు. నిజానికి ఆ భూములను అలిఫ్ అనే స్వచ్చంద సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ సంస్థ మాగంటి రూపాదేవిదని..జగన్ ఆరోపణ. ఈ ఆరోపణలను ప్రత్యేకంగా కోడలితో కలసి ప్రెస్ మీట్ పెట్టి మురళీమోహన్ ఖండించారు. ఈ విషయంలో మాగంటి రూప మరింత దూకుడుగా వ్యవహరించారు. ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలని లేకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు జగన్‌కు గడువు ఇచ్చారు.
ప్రస్తుతం భూములు కేటాయించిన అలీఫ్ అనే స్వచ్చంద సంస్థతో.. మాగంటి రూపకు.. సంబంధాలున్నాయని ఇప్పుడు నిరూపించాల్సిన పరిస్థితి వైసీపీ నాయకులపై పడింది. మాగంటి రూప సవాల్ పై వైసీపీ నేతలుగా ఇంకా నేరుగా స్పందించలేదు. మాగంటి రూప.. కొన్నాళ్ల నుంచి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మురళీమోహన్ కు బదులుగా మాగంటి రూప పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అమె నేరుగా ఎప్పుడూ రాజకీయ సమరంలోకి రాలేదు. తొలిసారి ఆమె నేరుగా జగన్‌కే సవాల్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. మాగంటి రూప దూకుడు చూస్తూంటే.. సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లే ఉన్నారు.