తప్పు చేసిన వాళ్ళే తాము నిర్దోషులమని తీర్పు ఇచ్చుకోడానికీ, ”మాగీ” అమ్మకాల అడ్వర్టయిజ్ మెంటుకీ పెద్దతేడా కనిపించడం లేదు. మాగీలో విషపూరిత జీవ రసాయనాలు లేవని కోర్టు నిర్ధారించక ముందే యాడ్స్ మోత మొదలైపోయింది.
స్విట్జర్లాండ్ కంపెనీ ”నెజల్’-నెస్లె” తయారు చేసే మాగీ నూడుల్స్ క్షణాల్లో సిద్ధమయ్యే రుచికరమైన ఆహారంగా సంవత్సరాల తరబడి పట్టణ జీవనశైలిలో పాతుకుపోయి, గ్రామాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ఎమ్ఎస్జి (మోనో సోడియం గ్లుటనేట్) అనే రసాయనం మితిమీరి వాటడమే మాగీ రుచికి కారణమన్న అభ్యంతరాల మేరకు ఎఫ్ఎస్ఎస్ఎఐ (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారికీ ఆఫ్ ఇండియా) సంస్ధ పరిశీలనలు చేసి జూన్ 5 న మాగీ సేమ్యాలను దేశవ్యాప్తంగా నిషేధించారు. మితిమీరిన రసాయనాలు కలపడం వల్ల మాగీ ప్రజల ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తోందన్న ఫిర్యాదుపై అప్పటికే డిల్లీ మొదలైన అనేక రాష్ట్రాలు మాగీ అమ్మకాలను నిషేధించాయి.
నిషేధాన్ని నెజెల్ సంస్ధ ముంబాయి హైకోర్టులో సవాలు చేసింది. నిషేధం చెల్లదని ఆగస్టు 13 న తీర్పు వచ్చింది. అయితే మాగీలో విషపూరిత రసాయనాలు లేవని ధృవపడే వరకూ అమ్మకాలు చేయకూడదని షరతు విధించింది. జాతీయ స్ధాయి గుర్తింపు వున్న (ఎన్ఓబిఎల్) ఆహార పదార్ధాలను పరీక్షించే ఏ మూడు లేబొరేటరీలైనా మాగీని విశ్లేషించి అందులో విషపూరిత రసాయనాలు లేవని ధృవీకరిస్తేనే అమ్మకాలకు అనుమతి వుంటుందని ఆ షరతులో స్పష్టం చేశారు.
మాగీ నిరపాయకరమని పదిరోజులక్రితం ఒక లేబొరేటరీ ధృవీకరించిందని మాగీ ప్రచారం ప్రారంభించింది. మరో రెండు లాబ్స్ నివేదికలు కూడారావాలి. మూడిటినీ హైకోర్టు పరిశీలించి దృవీకరించాలి ఆతరువాతే మాగీ అమ్మకాలు మొదలు పెట్టవచ్చు. అంతవరకూ వేచి వుండే సహనమూ, మర్యాదా మాగీకి లేకుండా పోయాయి.
నిషేధం నుంచి బయట పడే ప్రయత్నాల్లో మాగీ లో రసాయనాలు తక్కువే వుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు మాగీ నూడుల్స్ తిన్నవారిలో నమూనాగా కొందరిని ఎంచుకుని వైద్య పరీక్షలు చేయిస్తేనే విషరసాయనాల ప్రభావం బయట పడుతుంది. ప్రజాప్రయోజనాలు చూడవలసిన ప్రభుత్వాలు నెజెల్ సంస్ధ ఖర్చులతో ఈ ఏర్పాట్లు చేయించాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వాల పట్టించుకోనితనం మాగీ మార్కెట్ పునఃప్రవేశానికి గేట్లు తెరుస్తోంది.
ఇది ఉదాశీనత కాదు…ఉద్దేశ్యపూర్వకమే! విదేశీ వ్యాపార సంస్ధల ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు, నాయకులకూ మధ్య సన్నిహిత సంబంధాల వెనుక ”అన్ని విధాలా సహకరించగలమన్న అధికారిక ఒప్పందాలు” వుంటాయి. వాటి కూడా వచ్చే బహుమతులు వుంటాయి. రుజువులకు అందని లంచాలు వుంటాయి. తప్పుతేలకముందే, తనకు తానే నిర్దోషిగా ”మాగీ” తీర్పు ఇచ్చుకోవడం ప్రపంచీకరణ అనర్ధాల్లో ఒకటి…