ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గత నెల రోజుల నుంచి ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం.. ఏ విషయం బయటకు చెప్పలేదు. ఆయన కుటుంబానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, చెన్నైల్లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేసి ఏకంగా మూడురోజుల పాటు సోదాలు చేశారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆయనపై వైసీపీలో చేరాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉండటంతో.. టీడీపీని వీడటానికి ఆయన ఆలోచించారు. చివరికి టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ తరపున ఒంగోలు లేదా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి .. టీడీపీలో తనకు చంద్రబాబు ఎంతో సహకరించారని చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేతతో తనకు 37ఏళ్ల వ్యక్తిగత స్నేహం ఉందన్నారు. వైఎస్‌తో ఉన్న అనుబంధం కారణంగానే.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. మరో వైపు… విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేతతో రెండు సార్లు సమావేశమైనప్పటికీ.. తనకు పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడం.. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని టీడీపీ ఖరారు చేయడంతో.. ఆయన అనుచరులతో సమావేశం అయి… వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలు చాలా కాలంగా.. మళ్లీ తమ పార్టీలోకి రావాలని.. కొణతాలను కోరుతున్నారు.
గత ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ వైసీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత జగన్ తీరు నచ్చలేదని బయటకు వచ్చారు. ఏ పార్టీలో చేరలేదు. టీడీపీతో దగ్గరగా ఉన్నట్లుగా వ్యవహరించారు. టీడీపీలో చేరడం ఖాయమని చెప్పుకున్నారు. చివరికి మళ్లీ…వైసీపీలోకే వెళ్తున్నారు. కొసమెరుపేమిటంటే… కొణతాలకు బద్ద రాజకీయ వైరం ఉన్న దాడి వీరభద్రరావు కూడా… కొద్ది రోజుల కిందటే వైసీపీలో చేరారు. దాడి కూడా గత ఎన్నికల సమయంలో.. వైసీపీలోనే ఉన్నారు. వీరిద్దరూ..వైసీపీ నుంచి వేర్వేరుగా బయటకు వచ్చారు. మళ్లీ ఎన్నికలకు ముందు అదే పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.