మూడు రోజుల కిందట ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి చాలా నీరసించిపోయిందని బెయిల్ ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను అరెస్ట్ చేశారు. సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగోలేదనేది బహిరంగరహస్యం. కానీ ఆయనకు కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. సీబీఐ కూడా బెయిల్ ఇవ్వవొద్దని గట్టిగా వాదించింది. ఇది జరిగిన రెండు రోజులకే.. అదే లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా ఈడీ చెబుతున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌కు బెయిల్ మంజూరు అయింది. ల
తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. కోర్టు పరిగణనలోకి తీసుకున్నారు. రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇలాగే తన భార్యకు బాగోలేదని రెండు వారాల మధ్యంతర బెయిల్ తీసుకున్న అరబిందో శరత్ చంద్రారెడ్డి తర్వాత ఓ సారి బెయిల్ పొడిగించుకున్నారు.. తర్వాత రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత అప్రూవర్ గామారి క్షమాభిక్షకు కూడా అర్హుడయ్యారు. ఇదే ప్లాన్ లో మాగుంట రాఘవ్ కూడా ఉన్నారేమో తెలియదు కానీ..ఆయన కూడా ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై విడుదలదయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొంత మంది నిందితుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ మరికొందరి విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నయి దర్యాప్తు సంస్థలు. సౌత్ లాబీలో కవితే అత్యంత కీలకమని చెప్పి.. ఆమెను అరెస్ట్ చేయలేదు. అప్రూవర్లుగా ఇప్పటికే నలుగుర్ని మార్చారు. ఈ కేసు విషయంలో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ఇలాంటి పరిణామాల వల్లే ఏర్పడుతోంది. అయినా దర్యాప్తు సంస్థలు తమ దారిలో తాము వెళ్తున్నాయి. కే్సు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.