ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ అయ్యారని.. అయిన ఇచ్చిన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కీలక విషయాల గుట్టు బయటకు లాగామని ఈడీ మీడియాకు లీకులు ఇచ్చింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం జాబితాలో ఉంది. గతంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు. ఆయన కుమారుడ్ని మాత్రం చాలా సార్లు పిలిచి అరెస్ట్ చేశారు .చాలా కాలం జైల్లో ఉన్న తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు.
అప్రూవర్ గా మారినట్లుగా కోర్టులో పిటిషన్ వేసి క్షమాభిక్ష కూడా తెచ్చుకున్నారు. మాగుంట రాఘవ కంటే ముందే అరబిందో శరత్ చంద్రారెడ్డి కూడా అదే పని చేసి.. హాయిగా బయట తిరుగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను బయటపడేయడానికి ఒప్పందాలు జరిగిపోాయయని అందుకే సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. కేసీఆర్ తెలంగాణకే పరిమితమయ్యారు. తన పార్టీకి జాతీయ పార్టీగా మార్చినా ఆయన పట్టించుకోవడం లేదు. బీజేపీని విమర్శించడం లేదు. అదే సమయంలో ఈడీ కూడా దూకుడు ఆపేసింది. కానీ గత వారం రోజుల నుంచి మళ్లీ కదలికలు ప్రారంభమయ్యాయి. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. అలాగే తెలంగాణ అధికార పార్టీలోని ఓ ముఖ్యుడికి చెందిన సన్నిహితుడితో హవాలా లావాదేవీలపై పూర్తి సమాచారం సేకరించామని ఈడీ వర్గాలు మీడియాకు లీకులిచ్చాయి.
కొద్ది రోజుల్లో ఈ స్కాంలో కీలక పరిణామాలు ఉంటాయన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. అయితే కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. మరి ఎందుకు హఠాత్తుగా మళ్లీ ఈ కేసులో కదలికలు వస్తున్నాయన్నది సస్పెన్స్ గా మారింది. ఇవి కేవలం లీకులేనా.. రాజకీయంగా ఏదైనా సర్దుబాట్లు చేయాలనుకున్న తర్వాత.. చేసేసి సైలెంట్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తం డిల్లీ లిక్కర్ స్కాం అనేది బీఆర్ఎస్ పెద్దల కాళ్లకు అడ్డం పడుతోంది.