హైదరాబాద్: యోగా గురు బాబా రామ్‌దేవ్ నడుపుతున్న పతంజలి యోగపీఠ్ సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో 600 ఎకరాల భూమిని కేటాయించటం వివాదాలకు దారితీసింది. నారింజపళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయుర్వేద ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవంకులే, పతంజలి యోగపీఠ్‌కు చెందిన బాలకృష్ణ ఇటీవల ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ జిల్లాలో 200 ఎకరాలు, మిహాన్ ప్రాంతంలోని సెజ్‌లో 400 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం పతంజలి యోగపీఠ్ సంస్థకు కేటాయించింది.
ప్రభుత్వ చర్యపై మహారాష్ట్ర ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం తన ఇష్టమొచ్చినవారికి ఇలా కారుచౌకగా భూమిని కేటాయించటమేమిటని ప్రశ్నించాయి. నిజంగా పరిశ్రమలు స్థాపించేవారికి భూమిని ఇవ్వాలనుకుంటే ప్రకటనలు ఇవ్వటం, టెండర్లు జారీచేయటం చేసి ఉండేదని ఆరోపిస్తున్నాయి.