బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? లాంటి సినిమాలతో సునామీలా విరుచుకుపడ్డాడు.. సిద్దార్థ్. యంగ్ హీరోల్లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించాడు. భాషా బేధం లేకుండా సినిమాలు చేశాడు. అయితే.. ఆ తరవాత తన కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఎక్కడ సినిమా చేసినా కలసి రాలేదు. తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా టచ్ లోనే లేకుండా పోయాడు. ఇప్పుడు… ఇంత కాలానికి ‘మహా సముద్రం’తో మళ్లీ పలకరిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శర్వా కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ”అందరూ ఇది నా కమ్ బ్యాక్ సినిమా అంటున్నారు. కానీ నన్ను నేను రీ లాంచ్ చేసుకుంటున్నా” అని అంటున్నాడు శర్వా. అంతేకాదు సహ నటుడు శర్వాని పొగడ్తలతో ముంచేశాడు.
”ఇది మల్టీస్టారర్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇది శర్వా సినిమా. నేను తన పక్కన నిలబడే అవకాశం నాకొచ్చిందని గర్విస్తున్నా. తన వల్లే ఈ సినిమా పట్టాలెక్కింది. తన వల్లే ఈ సినిమాకి ఇంత బడ్జెట్ వచ్చింది. తన వల్లే ఈ సినిమా మాస్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా వల్ల నాకేం వస్తుంది? నా నటన గురించి ఎలా మాట్లాడుకుంటారో నాకు తెలీదు. కానీ శర్వా నాకు దొరికాడు. తనకి ఐ లవ్ యూ” అంటూ శర్వాపై తన ప్రేమని కురిపించేశాడు సిద్దార్థ్. ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా, తను తెలుగు నటుడిగానే చెప్పుకుంటానని, తెలుగు ప్రేక్షకులు తనకంతటి స్థానాన్ని ఇచ్చారని, ఇక నుంచి తెలుగు సినిమాలు వదిలి పోనని మాటిచ్చాడు సిద్దార్థ్.