ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వారం రోజుల నవ నిర్మాణ దీక్షలు బుదవారం సాయంత్రం కడపలో నిర్వహించబోయే మహా సంకల్పంతో పూర్తవుతాయి. నవనిర్మాణ దీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సభలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టాలు, కష్టాలు వాటి నుండి బయటపడటానికి గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రాభివృద్ధి కోసం భవిష్య ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు.
మహాసంకల్పం సభని మొదట ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని ప్రభుత్వం అనుకొంది కానీ రైతు భరోసా యాత్రల సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెదేపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి తన సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని కడపలో నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ హాజరవుతారు.
రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకి కరువా అన్నట్లుగా కడపలో మహాసంకల్పం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకొన్న రోజు నుంచే యావత్ పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి తరలివచ్చి పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీగా జనసమీకరణ జరుగుతోంది. ‘తెదేపా మార్క్’ అట్టహాసంతో మహా సంకల్ప సభని నిర్వహించేందుకు చాలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహా సంకల్పం ఉద్దేశ్యం ఒకటయితే, ఈ కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న హడావుడితో ఆ ఉద్దేశ్యం మరుగునపడి దాని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ప్రభుత్వం చేతిలో అధికారం, యంత్రాంగం అన్నీ ఉంటాయి. అది మహా శక్తివంతమైనదని అందరికీ తెలుసు. కనుక అది తన శక్తిని ఎవరికీ నిరూపించుకోవలసిన అవసరం లేదు. ఇలాగ తన రాజకీయ ప్రత్యర్ధులకి దానిని ప్రదర్శించుకోనవసరం అంత కంటే లేదు. ఒకవేళ నిరూపించదలచుకొంటే తుని విద్వంసం జరగకుండా నివారించడానికి వాటిని ఉపయోగించి ఉంటే అందరూ హర్షించేవారు. లేదా దానికి బాధ్యులైన వారిని ధైర్యంగా అరెస్ట్ చేసి ఉంటే హర్షించేవారు. కానీ అటువంటి అవసరమైన చోట ఉపయోగించకుండా, పిచుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు కడపలో మహాసంకల్పం నిర్వహించి జగన్మోహన్ రెడ్డికి తన బలప్రదర్శన చేయడం హాస్యాస్పదం.
ఈ కార్యక్రమాన్ని కడపలో నిర్వహిస్తున్నారు కనుక దానిలో ప్రసంగాలు కూడా ఆ ఉద్దేశ్యానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలతోనే సాగవచ్చు. కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహిస్తున్న మహాసంకల్పం ఉద్దేశ్యం ఏమిటి? ఆ ఉద్దేశ్యం నెరవేరుతోందా లేదా? తెదేపా, వైకాపాల రాజకీయ కక్షల గురించి మాట్లాడుకోవడానికే అయితే ఇంత ఖర్చు, హడావుడి అవసరమా? అనే సందేహాలు కలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిణతి లేదని వాదించే తెదేపా నేతలు కూడా ఆయనలాగే వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారా? ఆలోచించుకోవాలి.