”లక్ష్యాల్ని, సిద్ధాంతాల్ని దూరంగా పెట్టి జీవితంలో ఎక్కువ అనుభవించి రెచ్చిపోయిన నేను ఒక అతివాదినే. ఏదో ఒక లక్ష్యాన్ని ఎక్కువగా బుర్రకెక్కించుకొని దాన్ని ఎదిరించిన వాడినిని జాలి దయ లేకుండా తొక్కేసిన నీవూ ఒక అతివాదివే. ఈ రెండూ తప్పే. మితంగా వుండేది ఏదైనా కరక్టే” ఈ సినిమా చివర్లో గాంధీ మహాన్ పాత్ర చెప్పిన డైలాగ్ ఇది. ఇలాంటి ఐడియాలజీని ఎమోషన్స్ జోడించి ‘మహాన్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. నేరుగా అమోజన్ ప్రైమ్ లో విడుదలైన ‘మహాన్’ కథలోకి వెళితే..
మహాన్ (విక్రమ్) తాతలు మహాత్మ గాంధీ ఫాలోవర్స్. గాంధీ అడుగుజాడల్లో స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొంటారు. మహాన్ తండ్రి మధ్యపాన నిషేధ ఉద్యమం చేస్తుంటాడు. మహాన్ ని కూడా గాంధీజీ మార్గంలో నడవాలని బలవంతం చేస్తాడు. కట్ చేస్తే.. పెరిగి పెద్దవాడైన మహాన్.. గాంధీయిజం ఫాలో అవుతూ కామర్స్ లెక్చరర్ విద్యార్ధులకు పాఠాలు బోధిస్తుంటాడు. మహాన్ భార్య ఝాన్సీ (సిమ్రన్). ఆమె కూడా కరుడుకట్టిన గాంధీ ఫాలోవర్. భర్త పాటలు, ఫైట్లు వున్న ఇంగ్లీష్ సినిమా చూసినా ఒప్పుకోదు. వారికి ఐదేళ్ళ కొడుకు దాదాభాయి నౌరోజీ (ధ్రువ్ విక్రమ్). తెల్ల చొక్కా కాకుండా ఓ రంగుల చొక్కా వేసుకొని బార్ కి వెళ్లి మందుకొట్టాలనేది మహాన్ కల. ఒక రోజు ఆ ఛాన్స్ వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు సత్యవాన్ (బాబీ సింహ)తో కలసి ఫుల్ గా మందుకొట్టి జూదం ఆడి అదే మత్తులో నిద్రపోతాడు. ఉదయం లేచే సరికి మహాన్ జీవితం తలకిందులైపోతుంది. తన భర్త మందు తాగాడని, గాంధీయిజాన్ని మంటలో కలిపాడని కోపగించుకున్న ఝాన్సీ కొడుకుని తీసుకొని ఇల్లు వదిలివెళ్ళిపోతుంది. మహన్ వంటరౌతాడు. భార్య బిడ్డ కోసం ఎదురుచూస్తుంటాడు. ఇక అప్పటివరకూ రుద్దుడు గాంధీయిజంతో విసిగిపోయిన మహాన్.. సత్యవాన్ తో కలసి లిక్కర్ వ్యాపారాన్ని ఒక సామ్రాజ్యంలా విస్తరించాలని నిర్ణయించుకుంటాడు. అక్కడితో ఆగకుండా క్యాషినో కూడా పెట్టి ఒక గ్యాంగ్ స్టార్ ల మారిపోతాడు. మరో చిన్ననాటి స్నేహితుడు జ్ఞానోదయం( వెట్టై ముత్తుకుమార్) రూపంలో పొలిటికల్ పవర్ కూడా తోడౌతుంది. అన్నీ సజావుగా సాగిపోతున్న సమయంలో కొడుకు దాదాభాయి నౌరోజీ రూపంలో మహాన్ కి సవాళ్ళు ఎదురౌతాయి. చంపడమా లేదా చావడమా అనే పరిస్థితి మహాన్ ముందుటుంది. అప్పుడు మహాన్ ఏం చేశాడు ? ఐడియాలజీ- ఎమోషన్స్ మధ్య ఆట ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
ఒక ఐడియాలజీని అతిగా ఫాలోయితే జరిగే అనర్ధాలు ఎలా వుంటాయి ? ఇలాంటి లైన్ తో ఓ సినిమా చేయొచ్చని అలోచించిన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ని అభినందించాలి. గ్యాంగ్ స్టార్ సినిమాలు చేయడంలో కార్తిక్ ది డిఫరెంట్ స్టయిల్. మహాన్ కథని కూడా గ్యాంగ్ స్టార్ ట్రీట్మెంట్ తో ఎక్కడా బోరింగ్ లేకుండా నడపడంలో విజయం సాధించాడు దర్శకుడు. సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకులని హుక్ చేయగలిగాడు. ఈ కథ చెప్పడానికి కార్తిక్ రాసుకున్న స్క్రీన్ ప్లే కి ‘వావ్’ అనాల్సిందే. చిన్నప్పటి ఎపిసోడ్ ని మూల కథకి కనెక్ట్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది. కథ ముందుకు జరుగుతున్న కొద్ది రైటింగ్ టేబుల్ మీద దర్శకుడు ఎంత వర్క్ చేశాడో అర్ధమౌతుంటుంది. స్క్రీన్ పై కనిపించిన ప్రతి పాత్రని చక్కగా వాడుకున్నాడు.
మందు తాగాడని భర్తని వదిలేసిన భార్యని చూస్తే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్ది ఒకొక్క పాత్ర ఐడియాలజీ రివిల్ చేస్తున్నపుడు దర్శకుడి డీల్ చేసిన తీరుకి ముచ్చటేస్తుంది. గాంధీయిజం, అతివాదం మధ్య తేడా వుంది. గాంధీయిజంలో కూడా అతివాదం మిక్స్ చేసి కోపంతో ఊగిపోయి ఇల్లు వదిలివెళ్లిపోతుంది భార్య ఝాన్సీ పాత్ర. ఆ రోజు ఝాన్సీ అంత అతిగా ప్రవర్తించకపోయుంటే వాళ్ళ జీవితంలో అన్ని అనార్ధాలు జరిగేవి కావు. నిజానికి ఈ కథలో హీరోలు ఎవరు లేరు. అన్నీ పాత్రలే. ఎవరి స్వార్ధం వారిది. ఎవరి వాదాలు వారికున్నాయి. సత్యవాన్ కొడుకు రాకీని మహాన్ కాపాడినప్పుడు సత్యవాన్ కి మహాన్ దేవుడిలా కనిపిస్తాడు. తర్వాత సత్యవాన్ ప్రభువుకు దగ్గరై ప్రవచనాలు కూడా చెబుతాడు. తన కొడుకుని చంపింది మహాన్ కొడుకని సత్యవాన్ కి తెలిసిన తర్వాత కూడా మహాన్ ని క్షమిస్తాడు. కానీ సత్యవాన్ తో తన కొడుక్కి ఆపదవుంటుదని భావించిన మహాన్ .. తమ్ముడిలా చూసుకున్న సత్యవాన్ నే చంపేస్తాడు. ఈ కథలో స్వార్ధాలు తప్పితే హీరోయిజాలు కనిపించవు. అదే ‘మహాన్’ని స్పెషల్ గా నిలిపింది.
ఈ కథ నాలుగు లేయర్లలో కనిపిస్తుంది. ఫ్యామిలీ, ఐడియాలజీ, తండ్రి-కొడుకుల వార్, స్నేహం. ఈ నాలుగింటికి హ్యూమన్ ఎమోషన్స్ జోడించి గ్యాలరీని మెప్పించగలిగాడు దర్శకుడు. అయితే ఇందులో కూడా కొన్ని ఎత్తుపల్లాలు వున్నాయి. మొదటి సగంలో విక్రమ్ లిక్కర్ కింగ్ గా ఎదిగే క్రమం చూపిస్తే రెండో సగానికి వచ్చేసరికి కొడుకు దాదాభాయి నౌరోజీ పాత్ర ప్రవేశంతో చేతులు కట్టుకొని కూర్చోవడం అంతగా ఆకట్టుకోదు. అప్పటివరకూ తిరుగులేని వ్యక్తిగా వున్న మహాన్.. కొడుకుని చూసేసరికి ఒక్కసారిగా బలహీనుడైపోతాడు. బహుశా అది హ్యూమన్ వీక్ నెస్ అనుకోవాలి. ఇందులో విలన్ పాత్ర దాదాభాయి నౌరోజీదే. అతివాదం ఐడియాలజీతో ఒక దశలో సైకిక్ లా కనిపిస్తాడు. అయితే చివర్లో మహాన్ ఆడిన ఆట క్లైమాక్స్ కి సరికొత్త ఊపు తెస్తుంది. ఇక్కడే చిన్ననాటి ఎపిసోడ్ ని లింక్ చేసి డాట్స్ అన్నిటిని కలిపిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.
విక్రమ్ కి చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. విక్రమ్ నటనలో చాలా వైవిధ్యం వుంటుంది. గాంధీని పాలో అవుతున్నపుడు 40 ఏళ్ళ మహాన్ చాలా శాంతంగా కనిపిస్తాడు. గ్యాంగ్ లోకి వచ్చిన తర్వాత కూడా క్యారెక్టర్, లుక్స్ లో వయసు పెరుగుతున్న కొద్ది చిన్నచిన్న మార్పులతో డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకుంటాడు. అరవై ఏళ్ల విక్రమ్ లుక్ చాలా నేచురల్ గా వుంటుంది. కొడుకు తలపై గన్ పెట్టినప్పుడు, సత్యవాన్ ని క్షమాపణ కోరినప్పుడు, బిడ్డలాంటి రాకీ తనకళ్ళ ముందే చనిపోయినప్పుడు .. విక్రమ్ నటన స్టన్నింగ్ గా వుంటుంది. బాబీ సింహది మంచి పాత్ర. విక్రమ్ తో సమానంగా వుంటుంది. బాబీ సింహ లుక్స్ కూడా బావున్నాయి. బట్టతల చక్కగా కుదిరింది. జ్ఞానోదయం పాత్ర వేసిన వెట్టై ముత్తుకుమార్ కూడా అద్భుతంగా చేశాడు. మహాన్, సత్యవాన్, జ్ఞానోదయం పాత్రలు సినిమాకి కీలకం. ద్రువ్ పాత్రని సైకిక్ లా డిజైన్ చేశారు. విక్రమ్ తో పోటీపడి మరీ నటించాడు ద్రువ్. ఫైటింగ్ లో ద్రువ్ కి మంచి ఈజ్ వుంది. రాకీ పాత్ర వేసిన సనంత్ ఆకట్టుకున్నాడు. ఆ పాత్ర రూపంలో ఒక ఎమోషనల్ ఎండింగ్ దొరికింది. సిమ్రన్ పాత్ర కూడా కథకి ప్లస్ అయ్యింది. సంతోష్ నారయణ్ ఇచ్చిన పాటలు పెద్దగా రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం బావుంది. కెమరా పనితనం నీట్ గా వుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. విక్రమ్ అభిమానులే కాదు డిఫరెంట్ సినిమా చూడాలనే ఆసక్తివున్న ఎవరైనా సరే చూడొచ్చు. ‘మహాన్’ మిమ్మల్ని నిరాశ పరచడు.