హైదరాబాద్: రాజమౌళి తన జీవిత లక్ష్యం మహాభారతాన్ని తెరకెక్కించటమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తీసిన చిత్రాలన్నీ దానికి మెట్లని ఆయన ఇటీవల వివిధ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆయన మహాభారతం ఎప్పుడు తీస్తారోగానీ, ఆయన తీసిన బాహుబలి చిత్రం స్ఫూర్తితో బాలీవుడ్లో భారీ పెట్టుబడితో మహాభారతం తెరకెక్కించటానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 1988లో దూరదర్శన్‌లో ప్రసారమైన మహాభారత్ టీవీ సీరియల్ తీసిన సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ బీఆర్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టును చేపట్టబోతోంది. నాడు దూరదర్శన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆ సీరియల్‌ను బీఆర్ చోప్రా, ఆయన తనయుడు రవి చోప్రా తీశారు. మహాభారతాన్ని పెద్దతెరకు ఎక్కించాలని బీఆర్ చోప్రాకు చిరకాల కోరిక. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. దానిని నెరవేర్చాలని రవిచోప్రాకూడా ఆశించారుగానీ ఆయనకూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన భార్య రేణు చోప్రా, కుమారులు కపిల్, అభయ్ ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. అత్యంత భారీస్థాయిలో ఇటీవల వచ్చిన బాహుబలి చిత్రాన్ని చూసిన తర్వాత రవిచోప్రా కలను నెరవేర్చే సమయం ఆసన్నమైందని తాము భావిస్తున్నామని రేణు చెప్పారు. ఇది అంత సులువైన వ్యవహారం కాదని, పెద్ద స్టార్లు, భారీమొత్తంలో ఆర్థిక వనరులు కావాలని తమకు తెలుసని అన్నారు. ఇందులోని ప్రతిపాత్రా ఇప్పటి కాలానికి అన్వయిస్తుందని చెప్పారు. దీనికి సమయం పట్టొచ్చుగానీ, మహాభారత్‌ను సినిమాగా మలచాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కాలం, దేవుడు తమవైపు ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.