జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించి ఇప్పటికి దాదాపు మూడున్నర నెలలపైనే అయ్యింది. ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఎటువంటి సమస్యలు, అవరోధాలు లేనప్పటికీ భాజపా మద్దతుతీసుకోవడానికి సంకోచిస్తూ,దానికి ఏవేవో షరతులు పెడుతూ ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కాలక్షేపం చేసేసారు. మొదట్లో ఆమెను ఏదో విధంగా ప్రసన్నం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపా ప్రయత్నించినప్పటికీ ఆమె తీరుకి విసుగెత్తిపోయిన భాజపా తన ప్రయత్నాలను విరమించుకొంది. అధికారం కనుచూపు మేరలో కనిపిస్తున్నప్పటికీ తమ అధినేత్రి విచిత్ర వైఖరి కారణంగానే అది చేతికి అందకపోవడంతో పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయినవారిలో సహజంగానే అసంతృప్తి పెరగుతుంటుంది. బహుశః వారి ఒత్తిడి కారణంగానే మహబూబా ముఫ్తీ గత నెల రోజుల నుంచి ఒక్కో మెట్టు దిగివస్తూ భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు భాజపా ఆమెపై పైచెయ్యి సాధించినట్లు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడది కొద్దిగా బెట్టు చేస్తున్నట్లుంది.ఆమె వారం రోజుల క్రితమే డిల్లీ వచ్చి భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. మళ్ళీ నేడు మరోసారి డిల్లీకి వచ్చి అమిత్ షా, నరేంద్ర మోడీలతో చర్చించబోతున్నారు. భాజపా-పిడిపిల మధ్య దివంగత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హయంలో జరిగిన ఒప్పందంలో అన్ని హామీలను మోడీ ప్రభుత్వం అమలుచేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు భాజపా మద్దతు ఆమెకే అవసరం కనుక ఆ హామీల విషయంలో రాజీపడక తప్పదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా భాజపా అధికారంలో వచ్చింది కనుక దానిని భాజపా కూడా దానిని నిలుపుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వవచ్చును కనుక త్వరలోనే ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని భావించవచ్చును.