జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సుమారు మూడున్నర నెలలుగా సాగుతున్న రాజకీయ సస్పెన్స్ డ్రామాకి త్వరలో తెర పడబోతోంది. ఈరోజు శ్రీనగర్ లోని గుప్ కార్ అనే ప్రాంతంలో గల పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తీ సయీద్ నివాసంలో ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఆపార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆమెను ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొన్నారు. దానితో ఆమె జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి కావడం నిశ్చయమయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ నెలాఖరులోగా ఏదో ఒక ముహూర్తం ఖరారు చేసుకొని, త్వరలో ఆమె రాష్ట్ర గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేస్తారు. ఆమెకు మద్దతు ఇవ్వడానికి భాజపా చాలా కాలంగా సిద్దంగానే ఉంది. కనుక ఇంక ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి అవరోధాలు లేనట్లే భావించవచ్చును.