ముందస్తు ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యేసరికి.. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా… కంగారు పడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కనీసం ఒక్కొక్క స్థానంలో అయినా గెలిచి ఉనికి కాపాడుకోకపోతే మొత్తానికే మోసం వస్తుందని భయపడుతున్నారు. సొంతంగా పోటీ చేస్తే… వందకు వంద శాతం వారికి ఒక్క సీటు కూడా రాదని క్లారిటీ ఉంది. అందుకనే .. ప్రధాన పార్టీల వైపే వారు చూస్తున్నారు. విధానపరంగా.. వారికి.. ఇప్పటికిప్పుడు.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో జత కట్టే అవకాశం లేదు. వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ జనసేన పార్టీనే. పవన్‌కు ఉన్న క్రేజ్, అభిమానగణంను ఉపయోగించుకుని… ఎలాగోలా… తమ లక్ష్యం సాధించాలని వారు ఆరాటపడుతున్నారు.
కమ్యూనిస్టులపై పవన్ కల్యాణ్ కాస్తంత సానుకూలతతో ఉన్నారు. కానీ ఆ సానుకూలత ఎన్నికల్లో కలసి పోటీ చేసేంత స్థాయిలో లేదు. ఇప్పటికి అయితే కలసి పోరాటం చేద్దామనే స్థాయి వరకే ఉంది. కలిసి పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ కమ్యూనిస్టులకు ఏ విషయం చెప్పడం లేదు. పైగా 175 నియోజకవర్గాల్లోనూ…జనసేన పోటీ చేస్తుందంటూ… అవసరం ఉన్నా.. లేకపోయినా ప్రకటిస్తున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీ నేతలకు… ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. పవన్‌కల్యాణ్‌తో ఎలాగైనా పొత్తుకు ఒప్పించాలన్న పట్టుదలతో ఏపీ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు.
కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, లోక్‌సత్తాలతో పాటు ఇతర చిన్నాచితకా పార్టీలను కలుపుకుని మహాకూటమిగా పోటీ చేయాలని.. నిర్ణయించినట్లు కొద్ది రోజుల క్రితం సీపీఐ నేత రామకృష్ణ మీడియాకు చెప్పారు. కానీ ఇందుకు జనసేన అంగీకారం ఇంకా లభించలేదన్నారు. ఒప్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు రోజుల కిందట సీపీఎం మధు..తిరుపతిలో… వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పలేదు. ఈ రోజు…సీపీఐ రామకృష్ణ… మహాకూటమి తరపున సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌నే ప్రకటిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఎలాగోలా.. జనసేనను కూటమిలోకి తేవాలన్న తాపత్రయం కమ్యూనిస్టు పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
కమ్యూనిస్టులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. జనసేన అధినేత మాత్రం. వారికి కలసి పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. వారిని నొప్పించడం ఇష్టం లేని పవన్.. నేరుగా చెప్పడం లేదని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి. అన్నీ స్థానాల్లో పొత్తుల్లేకుండా పోటీ చేయాల్ననదే జనసేన విధానమని… పవన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు పవన్ నిరాదరణ.. మరో వైపు..కమ్యూనిస్టుల ప్రయత్నాలు.. ప్రస్తుతం ఏపీ కూటమి రాజకీయాల్లో కాస్తంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.