మహాకూటమి ఉనికి ఉంటుందా.. సీట్ల సర్దుబాటులో… తెగిపోతుందా.. అన్న సందేహాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇప్పటికి కామన్ మినిమం ప్రోగ్రాంపై ఓ కసరత్తు చేసిన.. మహాకూటమి నేతలు.. ఈ రోజు నుంచి అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా.. ఓ సారి… సీట్లపై అవగాహనకు వచ్చినప్పటికీ.. అసలు చర్చలు మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కాంగ్రెస్ అధిష్టానం… కూటమిలోని పార్టీలకు 29 సీట్లు కేటాయించి.. తొంభై సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీకి కోదందడరాం తెలంగాణ జనసమితితోనే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదండరాం ఇప్పటి వరకూ పలు దశల్లో మహాకూటమిలోని పార్టీలతో చర్చలు జరిగినా అందులో నేరుగా పాల్గొనలేదు. పార్టీ ప్రతినిధులుగా కపిలవాయి దిలీప్‌కుమార్, విద్యాధరరెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొంటూ వచ్చారు. ఇటీవల జరిగిన మహాకూటమి నేతల భేటీలో ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై స్పష్టత వచ్చింది. ఇక సీట్ల సర్దుబాటుపైనే దృష్టి కేంద్రీకరించాలని కోర్‌కమిటీలో నిర్ణయానికొచ్చారు. సీట్ల సర్దుబాటే ప్రధానాంశంగా జరగనున్న తదుపరి సమావేశంలో తమ పార్టీ తరఫున 25 స్థానాలను కేటాయించాలనే ప్రతిపాదనను మహాకూటమి ముందు పెట్టాలని భావిస్తున్నారు.
ఇక నుంచి మహాకూటమి సమావేశాలు సీట్ల సర్దుబాటు ప్రాతిపదికనే జరిగే అవకాశాలుండడంతో.. కూటమిలోని పార్టీల తరఫున ప్రధాన నేతలు, నిర్ణయాత్మక శక్తి ఉన్న నేతలే పాల్గొంటారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై శనివారం మహాకూటమి ప్రధాన నేతలందరూ భేటీ కానున్నారు. పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో.. ఆ మేరకు గౌరవప్రదమైన సీట్లను పొందేందుకు మహాకూటమిలోని ఇతర నేతలను ఒప్పించడమే ప్రధాన లక్ష్యంగా తాము చర్చల్లో పాల్గొంటామని కోదండరాం వర్గీయులు చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే సీట్లను.. అభ్యర్థులను కూడా ఖరారు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. పైకి ఎన్ని చెబుతున్నా.. నాలుగైదు సీట్లు ఇచ్చిన సీపీఐ కూడా.. రగడ సృష్టించే అవకాశాలు లేవు.అయితే.. మిత్రపక్షాలకు కేటాయించే సీట్ల విషయంలోనే.. కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడనుంది.