మహా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇప్పటికే చాలా ఆలస్యమైందనే భావన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండా టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు బుధవారం సమావేశమయ్యారు. మహా కూటమిని ఏర్పాటు చేసింది తామేననీ, దాన్లో కాంగ్రెస్ చేరిందనట్టుగా వారు అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ నుంచి వీలైనన్ని సీట్లు రాబట్టాలన్న ఉద్దేశంతోనే ఈ మూడు పార్టీలూ మరోసారి భేటీ అయ్యాయని సమాచారం. ఇంకోటి, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి దాదాపు ఒక స్పష్టత వచ్చేసిందనీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.
టీజేఎస్ కి 8 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చిందనీ, ఆ పార్టీ ఇంకా పట్టుపడితే మరో రెండు మాత్రమే పెంచాలనే నిర్ణయంతో ఉందట. సీపీఐకి కేవలం మూడు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించిందనీ, ఇక టీడీపీ విషయానికి వచ్చేసరికి… కాంగ్రెస్ కు పెద్ద ఒత్తిడేం లేదనీ, నంబర్లు కాస్త అటుఇటు అయినా సర్దుకునే ధోరణిలో ఆ పార్టీ ఉందన్నది మొదట్నుంచీ తెలుస్తున్నదే. ఇంకోటి, సీపీఐ, టీజేఎస్ లకు కాంగ్రెస్ మరికొన్ని హామీలు ఇచ్చినట్టుగా కూడా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఆ రెండు పార్టీలకూ ప్రాధాన్యత ఇస్తామని నచ్చజెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇంకోపక్క, కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే జాబితాను ప్రకటించే పనిలో ఉంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తోపాటు కొంతమంది నేతలు హైకమాండ్ దగ్గరకి ఇదే పని మీద వెళ్లారు. అయితే, కూటమి పార్టీ సీట్ల కేటాయింపులపై స్పష్టత ఇవ్వకుండా… కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించేసుకుంటే కొంత అసంతృప్తి వస్తుందన్న అభిప్రాయమూ ఉంది. అందుకనే, ఈ మూడు పార్టీలూ ఆశిస్తున్న స్థానాలను మినహాయించి, ఇతర నియోజక వర్గాల్లో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. కూటమిలోని పార్టీలకు ఇవ్వాల్సిన స్థానాలపై అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు, సోనియాతో కూడా రాష్ట్ర నేతలు చర్చిస్తున్నారు. మొత్తానికి, మహా కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు.