తెలంగాణలో మహాకూటమి సీట్లు, స్థానాలను తేల్చడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మిత్రపక్షాల సహనాన్ని పరీక్షిస్తున్నారు. కేసీఆర్ ను ఓడించడానికి అందరూ ఏకం కావాలని.. మొదట్లో అందరి ఇళ్లకు వెళ్లిన ఉత్తమ్.. ఇప్పుడు వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. సీట్లు , స్థానాలు సంగతి చెప్పకుండా.. టైంపాస్ చేస్తున్నారు. దీంతో.. టీజేఎస్, సీపీఐ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. కూటమి నుంచి గుడ్ బై చెప్పి.. సొంతంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో ఉత్తమ్ ఉన్న పళంగా.. పార్క్ హయత్‌లో… కోదండరాంతో సమావేశమయ్యారు. మొదట అందరూ సమావేశం అవుతారని అనుకున్నా ఎల్. రమణ, చాడ వెళ్లలేదు.
సీట్లపై స్పష్టత ఉన్నందున, తాము వెళ్లలేదని రమణ చెప్పుకొచ్చారు. తమను పిలవలేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఉత్తమ్ చెప్పిన సీట్ల విషయంపై… కోదండ అసంతృప్తితో ఉన్నారని… మధ్యలోనే వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. దీన్ని ఉత్తమ్ ఖండించారు కానీ… కోదండరాం విషయంలో మాత్రం.. అటూఇటుగానే ఉన్నారు. పార్టీలో మాట్లాడి చెబుతాననిచెప్పారని.. మీడియాకు చెప్పారు. అయితే.. కూటమి నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదనే ధీమాను వ్యక్తం చేశారు. కోదండరాంతో చర్చలు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగాయని అన్నారు. గా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఏ క్షణమైనా ఓ కొలిక్కి వస్తుందన్నారు.
మరో వైపు మహాకూటమి తీరుపట్ల చాడ వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇది కూటమికి మంచి పరిణామం కాదన్నారు.
మహాకూటమి ఎదుట 9 సీట్ల ప్రతిపాదన పెట్టామని సాధ్యమైనంతవరకు కూటమిలో సర్దుకుపోయేందుకే చూస్తామన్నారు. చివరిసారి చర్చల అనంతరం ప్లాన్‌బి అమలు చేస్తామన్నారు. అయితే మహాకూటమిని కాపాడేందుకు రాహుల్‌కు సన్నిహితంగా ఉండే.. మధుయాష్కీ లాంటి నేతలు రంగంలోకి దిగారు. మహాకూటమి సీట్లన్నీ ఒకేసారి ప్రకటించాలని చూస్తున్నామని మిత్రపక్షాలు తమకు ఎన్నిసీట్లు కావాలో నివేదిక ఇచ్చాయంటున్నారు. మంగళవారం.. ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతోంది. లిస్ట్ ఖారరవుతుంది. దాంట్లోనే.. మిత్రపక్షాలకు ఎన్ని ఇచ్చారో తేలుతుంది. ఆ తర్వాత కూటమి సర్కస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.