తెలంగాణలో అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. మహా కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటుపై మరో మూడు రోజుల్లో స్పష్టత ఇచ్చేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసే స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు సిద్ధమే అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అభ్యర్థుల విషయమై మూడు రోజులకు ఒక సర్వే చొప్పున ప్రజాభిప్రాయ సేకరణను క్షేత్రస్థాయిలో పార్టీ చేయిస్తున్నట్టుగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 1 లేదా 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి జాబితాను ప్రకటించబోతున్నారు. దీన్లో 40 మంది పేర్లు ఉండబోతున్నట్టు సమాచారం. ఇక, మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన కూడా దీపావళి పండుగకు ఒక రోజు ముందుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంతమంది ఆశావహులకు నిరాశ తప్పదని, అలాంటివారితో ముందుగానే పీసీసీ చర్చలు ప్రారంభిస్తుందనీ, అసమ్మతి ఎక్కడా బయట పడకుండా ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నట్టు చెబుతున్నారు. ప్రచారం విషయంలో ఇప్పటికే తెరాస దూసుకుపోతోందన్న అభిప్రాయం ఉన్నా… ఎన్నికల ప్రచారానికి నెల రోజుల గడువు సరిపోతుందనీ, అభ్యర్థుల ప్రకటన తరువాత ప్రచారం తీవ్రతరం చేస్తామని ఉత్తమ్ అంటున్నారు
తెరాస అభ్యర్థుల ప్రకటన, ప్రచారంపై కూడా కాంగ్రెస్ కీలక నేతల మధ్య విశ్లేషణ జరిగినట్టు సమాచారం. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల తెరాసకు నష్టమే జరిగిందనీ, అసంతృప్తులను మేనేజ్ చేయలేకపోతోందని హై కమాండ్ కి పీసీసీ తెలిపిందట! తెరాస అభ్యర్థులను ప్రకటించిన దగ్గర్నుంచీ కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందనీ, అభ్యర్థుల ప్రకటన తరువాత పార్టీకి మరింత ఊపు వస్తుందన్న ధీమాను హైకమాండ్ కు పీసీసీ ఇచ్చిందని చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్ జాబితా అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే, టిక్కెట్లు దక్కనివారిని ఎంత బుజ్జగించినా మౌనంగా ఉంటారా..? టిక్కెట్లు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న కొందరు సీనియర్లు కూడా కనిపిస్తున్నారు కదా!