మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అంటే మల్లు రవి గుర్తుకు వస్తారు. పదేళ్లుగా మల్లు రవి జడ్చర్లలో అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ అభ్యర్థిగా మల్లు రవి ఉంచారు. ఈ సారి మాత్రం మల్లు రవికి పార్టీలో..మహా కూటమి ఏర్పాటువల్ల తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ ఎదురవుతుంది. గత ఎనిమిదేళ్లుగా నియోజకర్గంలోని యువతను ఆకట్టుకుని.. వారితో ఓ టీమ్ తయారుచేసుకుని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అనిరుథ్ రెడ్డి అనే యవకుడ్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. చేరినపుడు మల్లు రవికి పోటీ రానని చెప్పిన అనిరుథ్.. ఇప్పుడు… తాను రేసులో ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని కూడా పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.
ఇక మహాకూటమి ఈ సీటుపై గట్టిగానే పట్టుబడుతోంది. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ కు జడ్చర్ల స్థానాన్ని పొత్తులో భాగంగా కేటాయిస్తున్నారంటూ ఇప్పటికే ప్రచారం ప్రారంభమయింది. ఎర్ర శేఖర్ జడ్చర్ల నుంచి మూడుసార్లు గెలిచారు. కానీ ఈ సారి ఆయన మహబూబ్ నగర్ నుంచే పోటీచేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ.. మహబూబ్ నగర్ ఇచ్చేది లేదని.. జడ్చర్ల నుంచే పోటీ చేసుకోవాలని కాంగ్రెస్ చెబుతోంది. ఇవి మల్లు రవికి తీవ్ర అసహనాన్ని తెప్పిస్తున్నాయి. మల్లు రవి సోదరుడు మల్లు అనంతరాములుకి మంచి పేరు ఉంది. ఆయన చనిపోయిన తర్వాత.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు మల్లు రవి. వైఎస్ కాలంలో ఆయనకు చాలా సన్నిహితుడిగా ఉన్నారు.
2008లో ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిచి… నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని వదిలిపెట్టి..జడ్చర్లకే పరిమితమయ్యారు. కానీ ఇపుడు స్థానికులకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ స్థానిక నేతలుచేస్తున్నారు. మల్లు రవిని మళ్లీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పంపించాలని స్థానికుడైన తనకు టికెట్ కేటాయించాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అందుకే.. అనిరుథ్ రెడ్డిపై మల్లు రవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రచార కమిటీ నేతలు వచ్చినప్పుడు.. ప్రచార రథాన్ని కూడా అనిరుథ్ రెడ్డిని ఎక్కనివ్వలేదు. కానీ మల్లు రవికి మాత్రం టిక్కెట్ ఖరారు కాలేదు. గతంలో ఓ వెలుగు వెలిగిన మల్లు రవికి కాంగ్రెస్ పార్టీలోనే పొగపెట్టారు. టికెట్ పొత్తులో భాగంగా ఇతరులకు కేటాయింప చేయాలని.. ఒకవేళ పార్టీ నుంచే అయితే స్థానిక వాదాన్ని తీసుకువచ్చి..అనిరుధ్ కు ఇప్పించాలని కూడా పార్టీలోని సీనియర్లే ప్రయత్నిస్తున్నారు.