బయోపిక్లెప్పుడూ ఆసక్తి రేకెత్తించేవే. కాకపోతే… అందుకు తగిన పాత్రధారుల్ని ఎంపిక చేసుకోవడం నిజంగా కత్తిమీద సాము. సావిత్రి కథని తెరపైకి తీసుకొస్తున్నప్పుడు ఆ పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? సావిత్రికి ధీటుగా కనిపించే నటి ఎవరున్నారు? అనే ఆసక్తి నెలకొంది. కీర్తి సురేష్‌ని ఎంచుకుంటే… చాలామంది పెదవి విరిచారు. ‘ఇక ఈ సినిమా అయినట్టే’ అంటూ హాస్యమాడారు. కానీ ఏమైంది? కీర్తి సురేష్ నిలిచింది, గెలిచింది. కీర్తి సురేష్‌ని ఎంపికతో దర్శక నిర్మాతల పని అయిపోలేదు. ఒకొక్క పాత్రకూ.. నటీనటుల్ని వెదుక్కంటూ వెళ్లారు. దాదాపుగా అన్ని పాత్రలూ బాగానే వర్కవుట్ అయ్యాయి. కాబట్టే సినిమా ఆస్థాయిలో ఆడింది.
ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది. అందుకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఓ విధంగా ఎన్టీఆర్ బయోపిక్‌ని `మహానటి` పరోక్షంగా సాయం చేసినట్టైంది. బయోపిక్ అంటే ఎలా తీయాలో… ఈ సినిమా నేర్పించింది. నటీనటుల ఎంపిక ఎంత పక్కాగా ఉండాలో సూచించింది. అయితే ఇప్పుడు క్రిష్, ఎన్టీఆర్‌లు అదే దారిలో వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ బయోపిక్‌లో మోహన్ బాబు, నాగచైతన్య ల ఎంపిక దాదాపుగా ఖాయమైంది. మోహన్‌బాబు ఎస్వీఆర్‌గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. చైతూ ఏమో ఏఎన్నార్‌గా నటిస్తాడట. మహానటిలో వీరిద్దరూ ఆ పాత్రలే పోషించారు. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. సావిత్రి పాత్రకు గానూ కీర్తిని ఎంచుకున్నారని టాక్. సావిత్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది కాబట్టి, సావిత్రి అంటే ఈ తరానికి కీర్తి సురేష్ గుర్తొస్తుంది కాబట్టి ఆ పాత్రకు ఆమె తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరని ఎంచుకుని ఉండొచ్చు. కాకపోతే… మహానటిలో కనిపించినవాళ్లు ఎన్టీఆర్‌లోనూ తారసపడితే… సినిమాలో పాత వాసనలే కనిపిస్తాయన్నది జనాల అనుమానం.
సావిత్రి అయిపోయింది. ఆ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు ఎన్టీఆర్ మొదలైంది. అందుకోసం చిత్రబృందం కొత్తగా కసరత్తు చేయాల్సిందే. ఆల్రెడీ ఎస్వీఆర్‌గా మోహన్ బాబు ఎలా ఉంటాడో, ఏఎన్నార్‌గా చైతూ ఎలా ఉంటాడో, సావిత్రిగా కీర్తి ఎలా మురిపిస్తుందో తెలిసిపోయింది. అక్కడి నుంచి కాపీ కొట్టి.. ఎన్టీఆర్‌లో పేస్ట్ చేయడం వల్ల ఏం లాభం? అందులో అటు క్రిష్, ఇటు బాలయ్య గొప్పదనం ఏముంటుంది? ఆయా పాత్రల్లో వేరే వాళ్లని తీసుకొచ్చి మెప్పించడంలో కదా అసలు సిసలైన ఛాలెంజ్ కనిపిస్తుంది. అది వదిలేసి… ”మహానటి`లో ఎవరు నటిస్తే వాళ్లని పట్ట్రాండ్రా” అంటే ఎలా?? ఈ విషయంలో ఎన్టీఆర్ టీమ్ కాస్త ఆలోచించుకుంటే మంచిదేమో..??