తెలుగు360.కామ్ రేటింగ్ : 3.75/5
నిప్పులు చిమ్ముకుంటూ నింగిని నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో మీరే..
నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే
నిర్థాక్షణ్యంగా మీరే..!
ఓ వ్యక్తి గెలుపుకీ – ఓటమికీ ఉన్న తేడా అది.
ఓ జీవితం ఎత్తుకీ – పల్లాకినీ ఉన్న బేధం అది.
ఓ చిరునవ్వుకీ – కన్నీరుకీ ఉన్న దూరం అది.
ఓ విత్తు మహా వృక్షంగా మారడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
అదే మహా వృక్షం కూకటి వేళ్లతో సహా నేలకు ఒరిగిపోవడానికి ఒక్క తుఫాను చాలు.
సావిత్రి కథ అలాంటిదే. నిప్పులు చిమ్మిన జీవితం ఆమెది. నెత్తురు కక్కుకుంటూ నేలకు ఒరిగిన విషాదం ఆమెది.
అభినయం అనే విత్తు.. అమెను మహా నటిని చేసింది. ప్రేమ అనే మత్తు… తుఫానుగా మారి ఆ మహా వృక్షాన్ని నేలకు వంచింది. అందుకే ఈ కథ చరిత్ర అయ్యింది. ఆ కథలో ఆమె అభిమానులకో, ఈ తరానికో తెలియాల్సిన విషయాలు, విష వలయాలు ఎన్నో ఉన్నాయని గ్రహించాడు నాగ అశ్విన్. అక్కడే… దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఆమె కథని, అంతే క్లుప్తంగా, అంతే సూటిగా, అంతే లోతుగా చెప్పగలిగితే.. మరో సగంవిజయం తోడవుతుంది. మరి ఈ ప్రయాణంలో నాగ అశ్విన్ విజయవంతం అయ్యాడా? సావిత్రి కథని ఏ రూపంలో తెరపైకి తీసుకొచ్చాడు??
కథ
“కథని వెదుక్కుంటూ వెళ్తే.. ఓ చరిత్ర కనిపించింది“
– మహానటిలో ఓ డైలాగ్ ఇది. అవును…. సావిత్రి కథని వెదుక్కుంటూ వెళ్తే మనకూ ఓ చరిత్ర కనిపిస్తుంది. అనామకురాలు స్టార్‌గా మారడం కొత్త కథ కాదు. ప్రతీ స్టార్ వెనుక ఉండే కథే ఇది. కానీ ఆ స్టార్ – తన జీవితాన్ని అతి దుర్భరమైన పరిస్థితుల్లో ముగిస్తే..? ఆ చరిత్ర చదవాల్సిందే. ఆమె కథల పేజీలు తిప్పాల్సిందే. `మహానటి` కథలోని కోర్ పాయింట్.. కీ పాయింట్ అదే. ఓ వ్యక్తి జీవితాన్ని సినిమాగా మలచాలంటే…. ఆ వ్యక్తి తాలుకు కథ ఒక్కటే తెలిస్తే సరిపోదు. ఆ కథలో ఉన్న పెయిన్ కూడా అనుభవించగలగాలి. ఆ కథ వెనుక ఉన్న కథని కూడా తెలుసుకోగలగాలి. ఈవిషయంలో నాగ అశ్విన్ విజయం సాధించాడనే చెప్పాలి. బయోపిక్ ఓ విధంగా `రా` మెటీరియల్. దాంట్లో కాస్త కల్పన కూడా జోడించాలి. కొత్తపాత్రల్ని సృష్టించాలి. అయితే ఆ మోతాదు ఎంత వరకూ ఉండాలి? అనేది దర్శకుడి ఊహా శక్తికీ, సృజనకీ సంబంధించిన విషయం. కొత్త పాత్రలు, ఉప కథలూ ఎక్కువైతే అసలు పాత్ర గతి తప్పుతుంది.
అందుకే.. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఆంటోనీ, వాణి పాత్రలు మినహాయిస్తే కొత్త పాత్రలేం కనిపించవు. సావిత్రి కథని ప్రేక్షకులకు చెప్పడానికి ఆంటోనీ – వాణిల మధ్య ప్రేమకథని వాడుకున్నాడు దర్శకుడు. కథలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లిన విధానం.. ఆ పాత్రల చుట్టూ ప్రేక్షకుడిని తిప్పే ప్రయత్నం ఆకట్టుకుంటాయి. సావిత్రి జీవితంలోని ఎత్తుపల్లాల్ని వీలైనంత సున్నితంగా, వివాద రహితంగానే చూపించారు. సావిత్రి అనగానే ఆమె అభిమానులకు గుర్తొచ్చే మధురమైన స్మృతుల్ని (కెవి రెడ్డి తో రెండు కన్నీటి బొట్ల సీన్ లాంటివి) రోమాంఛితంగా తెరకెకెక్కించారు. సావిత్రి మహా నటి ఎందుకయ్యిందో చెప్పడానికి ఉదహరించిన సన్నివేశాలు చాలా విపులంగా.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
తొలి సగంలో సావిత్రి నటిగా ఎదిగిన తీరుకీ, ఆమె ప్రేమకథకీ సమ ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు. జెమినీ గణేశన్‌తో ప్రేమలో పడడం. అతన్ని పెళ్లి చేసుకోవడం తొలి సగంలో కీలక ఘట్టాలు. ఓ పెళ్లయినవాడ్ని సావిత్రి ఎలా ప్రేమించింది? ఎందుకు పెళ్లి చేసుకుంది? అనే విషయాల్ని ఎలాంటి ఆక్షేపణా లేకుండా తీయడం.. ఓ విధంగా కత్తిమీద సామే. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలు చూస్తే… జెమినీ గణేశన్ దే తప్పంతా అన్నట్టు కనిపిస్తాయి. కానీ తూకం పూర్తిగా అటు వైపే మొగ్గకుండా జాగ్రత్త పడ్డారు. జెమినీ క్యారెక్టర్ని ముందు నుంచీ ఒకేలా చూపిస్తూ… పెళ్లకి వ్యతిరేకిని అంటూ డైలాగులు చెప్పిస్తూ.. అలాంటి వాడు ఇలా ప్రవర్తిస్తే పెద్ద తప్పేం కాదేమో అన్న భావన ప్రేక్షకులలోకి తీసుకొచ్చే ప్రయత్నం కనిపించింది. జెమిని గణేశన్‌ని కాకుండా.. విధినే విలన్‌గా చేయడానికి దర్శకుడు ఇంకాస్త కసరత్తు చేశాడు. సావిత్రి తిరోగమన దశ ఈ కథకు కీలకం. సావిత్రి అనగానే…ఆమె చెడు అలవాట్లూ చూపించాలి. ఆ సన్నివేశాల్లోనూ బ్యాలన్స్ చూపించాడు దర్శకుడు. ఆ పాత్రపై సానుభూతి కలిగిస్తూ, కలిగిస్తూ… సావిత్రిఈ దశలో ఏం చేసినా తప్పు కాదని ప్రేక్షకుడు అనుకునేలా ఏమార్చగలిగాడు.
తొలి సగంలో కెవి రెడ్డి, చక్రపాణి, సింగీతం.. ఇలా దిగ్గజాలతో సావిత్రికి ఎదురైన అనుభవాల్ని చూపించారు. సినిమా పరిజ్ఞానం ఉన్నవాళ్లకూ… ఆయా వ్యక్తుల గురించి తెలిసిన వాళ్లకు, సావిత్రి కథతోనూ జీవితంతోనూ పరిచయం ఉన్నవాళ్లకూ ఆయా సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి. కానీ ఇవేం తెలియనవాళ్లకు అందులోని గొప్పదనం అర్థం కాదు. పైగా కనెక్షన్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్‌ని ఒకే ఒక్క ఫ్రేమ్‌లో చూపించారు. కానీ ఆ సన్నివేశం నందమూరి అభిమానులతో చప్పట్లు కొట్టించేలా ఉంది. ఏఎన్నార్‌ని పరిమితంగానే వాడుకున్నా… ఆయా సన్నివేశాలన్నీ అక్కినేని ఫ్యాన్స్‌కి వినోదం పంచిపెడతాయి.
సావిత్రి కథలో ప్రధాన ఘట్టం… ఆమె చరమాంకం. అసలైన విషాదం అందులోనే ఉంది. ఈ భాగాన్ని ఎంత గుండెకు హత్తుకునేలా తీర్చిదిద్దితే ఈసినిమా అంత విజయం సాధిస్తుంది. మహానటిగా సావిత్రి చివరి దశలో పడిన నరకయాతనని.. తన మాటల్లో చెప్పి విషాదాన్ని పండిస్తాడేమో అనుకుంటే… దర్శకుడు తన ఫ్రేమ్‌ని సమంతవైపు తిప్పాడు. ఇక్కడే దర్శకుడిలోని మేధాతనం అర్థమైంది. సావిత్రి కోమాలో ఉంది. మరి ఆమె కోణంలోంచి విషాదాన్ని పండించడం ఎలా? అందుకే సమంత పాత్రని వాడుకున్నాడు. పతాక సన్నివేశాల్లో సమంత చెప్పిన డైలాగులన్నీ.. అక్షర సత్యాలు. సావిత్రి కథ కాదు.. అదో చరిత్ర. తరతరాలు ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటాయి. ఈ సన్నివేశంతో ఈ మహా ప్రయత్నానికి ఘనమైన ముగింపు పలికారు.
నటీనటులు
సావిత్రికీ – కీర్తి సురేష్‌కీ పోలికేంటి? అనుకున్న వాళ్లకు సమాధానం… ఈ సినిమాలోని కీర్తి నటన. కీర్తి సావిత్రిలా మారడానికి తెర వెనుక ఎంత తపస్సు చేసిందో తెలీదు గానీ… అక్షరాలా.. సావిత్రిని పూనేసింది. కళ్లలో అమాయకత్వం, చూపుల్లో విషాదం, మాటల్లో మెరుపు, మొహంలో తెలియని వర్చస్సు ఇవన్నీ కీర్తిలోనూ కనిపించాయి. మాయాబజార్లో ఎస్వీఆర్‌లా నటించడానికి సావిత్రి ఎంత కసరత్తు చేసిందో, సావిత్రిలా కనిపించడానికి కీర్తి అంతకు మించి శ్రమ పడి ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలమూ దక్కింది. మహానటి అంటే సావిత్రి గుర్తొచ్చినట్టు ఈసినిమా చూశాక సావిత్రి అంటే కీర్తి గుర్తొస్తుంది. సమంతకు ఇది నిజంగా ఓ కొత్త పాత్ర. ఆమెలోని నటిని మరో రూపంలో ఆవిష్కరించుకునే అవకాశం దక్కింది. తొలి సగంలో ఓ విధంగా తనే ఈ కథని నడిపించింది. దుల్కర్, విజయ్.. ఇద్దరూ పోటీ పడి నటించారు. మోహన్ బాబుతో మొదలుకుని, అవసరాల శ్రీనివాస్ వరకూ అందరివీ అతిథి పాత్రలే. ‘ఈ పాత్రకు వీళ్లనెందుకు తీసుకున్నారు..’ అని ఆక్షేపించకుండా నటీనటుల ఎంపిక సమతూకంలో సాగింది.
సాంకేతిక వర్గం
దర్శకుడిగా నాగ అశ్విన్ విజన్‌కు నూటికి నూరు మార్కులూ పడతాయి. ఓ బయోపిక్‌ని ఎలా చూపిస్తే బాగుంటుందో అలానే చూపించాడు. ఓ మహా జీవితాన్ని తెరపై అందంగా, అర్థవంతంగా తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో బుర్రా సాయిమాధవ్ సంభాషణలు తోడుగా నిలిచాయి.
- పెద్ద వాళ్లని గౌరవించాలి – పెద్దవాళ్లు కూడా సావిత్రి గారిని గౌరవించాలి
- పెళ్లయిన వాడు ప్రేమలో పడితే అది ప్రేమకు పరిక్షా? పెళ్లికి పరీక్షా?
- ప్రతిభ ఇంటిపట్టునే ఉండిపోతే.. ప్రపంచం భ్రష్టు పట్టుకుపోతుంది
- ఆడదాని ఏడుపు అందరికీ తెలుస్తుంది. మగాడి ఏడుపు మందు గ్లాసుకి మాత్రమే తెలుస్తుంది
- వడ్డించిన చేతులకున్న ఉంగరాలను కూడా లాక్కునే కాలం ఇది – ఇవి కొన్ని మెరుపుల మాత్రమే.
ప్రేక్షకుల్ని 20, 30, 40 ఏళ్ల క్రితం రోజులకు తీసుకెళ్లడం సాధారణమైన విషయం కాదు. సెట్స్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా.. ఇవన్నీ కలసికట్టుగా కనికట్టు చేస్తేనే ఈ కల సాకారం అవుతుంది. ఈ విషయంలో సాంకేతిక నిపుణులంతా తలో చేయి వేశారు. మిక్కీ పాటలు ఓకే అనిపిస్తాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది.
తీర్పు: ఓ వ్యక్తి జీవితాన్ని సినిమాగా మలచడం, దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో అనువదించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకే తెలుగులో బయోపిక్‌ల జోలికి వెళ్లడానికి దర్శకులు భయపడతారు. బయోపిక్ అంటే బాలీవుడ్ వాళ్లే తీయాలి… అనుకునే వాళ్లకు ‘మహానటి’ ఓ మేలుకొలుపు. ఇక నుంచి తెలుగులోనూ ఇలాంటి సినిమాలు వస్తాయి. ఆ స్ఫూర్తి.. మహానటి ఇచ్చింది
ఫినిషింగ్ టచ్: ఇది కథ కాదు… చరిత్ర
తెలుగు360.కామ్ రేటింగ్ : 3.75/5