అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఓ వారం వెనక్కు వెళ్తందని ఇప్పటికే అనధికారికంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. సినిమా యూనిట్ కూడా వీటిని ఏమీ ఖండించలేదు. చిత్ర దర్శకుడు క్రిష్ బ్యాలెన్స్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా వున్నారు. ఇప్పటికి వున్న షెడ్యూలు ప్రకారం 28 వరకు షూటింగ్ వుంది. అవసరం పడితే ఒకటి రెండు రోజుల పెరుగుతుంది కానీ తగ్గదు.
ఆపైన ఎడిటింగ్, రీరికార్డింగ్, వగైరా, వగైరా వ్యవహారాలు వుంటాయి. అందువల్ల ఫిబ్రవరి 8కి విడుదల కావడం అంటే కాస్త కష్టమైన పనే. అందుకే ఫిబ్రవరి 15ను లేటెస్ట్ డేట్ గా ఫిక్స్ చేసి, బయ్యర్లకు ఇన్ ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఓ వారం వెనక్కు వెళ్లడం వల్ల హడావుడి పడాల్సిన పనిలేకుండా వుంటుంది, ఫైనల్ ప్రొడెక్ట్ ఒకటికి రెండు సార్లు చూసుకుని, సరి చేసుకునే అవకాశం వుంటుంది.
రెండో భాగం మీద యూనిట్ చాలా ధీమాగా వుంది. ఈ పార్ట్ కచ్చితంగా జనాలను ఆకట్టుకుంటుందని భావిస్తోంది. వాస్తవానికి అంతర్గత డిస్కషన్లు అన్నింటిలో బయోపిక్ ను రెండు భాగాలుగా చేయడమే తప్పిదం అయిందని ఓ స్థిర అభిప్రాయానికి వచ్చారని వినికిడి. రానా కూడా రెండుభాగాలుగా కాకుండా ఒకే పార్ట్ గా తీసి వుంటే సినిమా అద్భుతంగా వుండి వుండేదని సన్నిహితుల దగ్గర కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
బాలయ్యకు వున్న పాత్రల పోషణ సరదాను కాదనలేక, క్రిష్ రెండు భాగాలు అన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకే తొలిభాగంలో మిస్సయిన ఎమోషన్లు, ఉత్కంఠ, రేసీ స్పీడ్ అన్నవి రెండో భాగంలో కచ్చితంగా వుండేలా జాగ్రత్త పడుతున్నారు. తొలిభాగం కొనుగోలు చేసిన వారే మలి భాగం కూడా పంపిణీ చేస్తారు. తొలిభాగం నష్టాలు పూడ్చుకున్నాక, పంపిణీ కమిషన్, ఖర్చులు పోను, ఏమైనా మిగిలితే నిర్మాతకు అందిస్తారు.