Maharaja movie review
తెలుగు360 రేటింగ్ 3/5
విజయ్‌సేతుపతి… ఈ నటుడి గురించి కొత్తగా మాట్లాడుకొనేది లేదు. తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. తనకంటూ స్టార్డమ్ ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే, అతను ఈ రెండింటి గురించీ పట్టించుకోడు. ఇమేజ్‌లూ, స్టార్డమ్లూ సినిమాని కాపాడలేవు. కథొక్కటే ముఖ్యం అని నమ్మే నటుడు. అందుకే తను ప్రయోగాలు చేశాడు. కొత్త జోనర్లను టచ్ చేశాడు. ఏ పాత్ర ఇచ్చినా, అందులో ఇమిడిపోయాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ గిరి గీసుకోకుండా, తనలోని నటుడ్ని సంతృప్తి పరచుకొంటూనే వెళ్లాడు. అందుకే తనకూ, తన సినిమాలకూ అభిమానులు ఏర్పడ్డారు. ఆ ప్రయాణం 50వ సినిమాకు చేరింది. అదే ‘మహరాజ’. 50వ సినిమా అంటే మైలు రాయిలాంటిది. ఏ స్టార్ అయినా ఇలాంటి సమయంలోనే మరో స్టార్ డైరెక్టర్ని వెదుక్కొని ఓ క్రేజీ కాంబినేషన్‌ని సెట్ చేస్తాడు. కానీ విజయ్ మళ్లీ కొత్తగా ఆలోచించాడు. ఓ కొత్త దర్శకుడ్ని, కథనీ నమ్మి.. సినిమా అప్పగించాడు. ఈ సినిమా ప్రమోషన్లలో `దర్శకుడ్ని కాదు.. కథని నమ్మాను` అన్నాడు. మరి… అంతగా ‘మహరాజ’ కథలో ఏముంది? విజయ్‌సేతుపతి కెరీర్లో ఈ సినిమాకున్న స్థానమేంటి?
మహరాజా (విజయ్‌సేతుపతి) ఓ బార్బర్. తనదో సామాన్యమైన జీవితం. భార్య చనిపోతుంది. కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు. పెద్దగా మాట్లాడడు. తన పనేదో తనదే. కానీ కూతురంటే ప్రాణం. తన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఓ రోజు తన ఇంట్లో దొంగలు పడి లక్ష్మిని ఎత్తుకుపోతారు. తన లక్ష్మిని వెదికి పెట్టమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు మహరాజా. ఇంతకీ లక్ష్మి ఎవరు? తనని ఎవరు దొంగిలించారు? వాళ్లు దొరికారా, లేదా? అనేదే మిగిలిన కథ.
నిజానికి ట్రైలర్, టీజర్లో కూడా ఇంతే కథ చెప్పారు. రివ్యూలో కూడా ఇదే చెప్పాల్సివచ్చింది. ఎందుకంటే ఇంతకు మించి ఒక్క విషయం బయటకు చెప్పినా, సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ మిస్సవుతారు. అలా రాసుకొన్నాడు దర్శకుడు తన స్క్రీన్ ప్లే. హృదయాన్ని బద్దలు కొట్టే ఓ సన్నివేశం నుంచి కథ మొదలవుతుంది. హీరోని చాలా సాదా సీదాగా పరిచయం చేస్తారు. 50 వ సినిమా కదా అని బిల్డప్పులు, భారీ ఇంట్రోల జోలికి వెళ్లలేదు దర్శకుడు. ఈ కథ కూడా అవేం డిమాండ్ చేయలేదు. స్కూల్లో ప్రిన్సిపాల్‌తో తన కూతురికి సారీ చెప్పే సీన్లోనే దర్శకుడిలో విషయం ఉందన్న సంగతి అర్థమైపోతుంది. ఆ సీన్లోనే హీరో స్టామినా, కాలిబర్, తన తెగువ, మొండితనం ఇవన్నీ చెప్పేశాడు దర్శకుడు. నిజానికి హీరో అక్కడ ఫైట్ చేయడు. వార్నింగులు ఇవ్వడు. ‘నా కూతురుకి సారీ చెప్పండి సార్’ అంటూ మర్యాదగానే తన హీరోయిజాన్ని చూపించేశాడు. ఇలాంటి సీన్ పడిన తరవాత సినిమాపై, దర్శకుడిపై నమ్మకం ఏర్పడతాయి. ఆ తరవాత ఆ కథలో మరింతగా లీనం అయిపోతాం.
పోలీస్ స్టేషన్ సీన్‌తో.. ఆసక్తి రెట్టింపు అవుతుంది. అసలు ఆ లక్ష్మి ఎవరన్నదే మొదటి ట్విస్టు. దాని చుట్టూ కాస్త డ్రామా, కాస్త సస్పెన్స్, కాస్త హ్యూమర్ జోడిస్తూ కథని ముందుకు తీసుకెళ్లాడు. అసలు మహరాజ పోలీస్ స్టేషన్ చుట్టూ ఇంతగా తిరుగుతున్నది, ఇంత వేదన పడుతోంది లక్ష్మి గురించి కాదు, అంతకు మించిన పాయింట్ ఏదో ఉందన్న సంగతి ప్రేక్షకుడి ఊహకు అందుతూనే ఉంటుంది. అక్కడే… సెల్వ (అనురాగ్ కాశ్యప్) పాత్రని పరిచయం చేశాడు. సెల్వ ఓ దొంగ. తను చేసే దొంగతనాలు, ఆ పేట్రన్ ఒళ్లు జలదరించేలా ఉంటాయి. అలాంటి కరుడుగట్టిన దొంగ కూడా ఇంటికి వెళ్తే, ఓ తండ్రిలా, భర్తలా మారిపోతాడు. తన పాప కోసం ఆరాటపడుతుంటాడు. దొంగలా సెల్వని చూస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందో, తండ్రిగా సెల్వని చూసినప్పుడు అంత ముచ్చటేస్తుంది. అసలు ఓ దొంగలో ఇలాంటి కోణాన్ని ఎందుకు ఎలివేట్ చేస్తున్నాడు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రేక్షకుడి చుట్టూ తిరుగుతుంటాయి. వాటన్నింటికీ దర్శకుడు అవసరమైన సమయంలోనే సమాధానం చెప్పాడు. నిజానికి స్క్రీన్ ప్లేలో ఇది చాలా ముఖ్యమైన అంశం. చిక్కుముడి వేయడం కాదు, దాన్ని సరైన సమయంలో, సరైన చోట రివీల్ చేయగలగాలి. ‘మహరాజ’లో అది నూటికి నూరుశాతం పర్ఫెక్ట్గా అప్లై అయ్యింది.
సినిమా చూస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థపై కోపం వస్తుంటుంది. ఎవడో ఏదో చెప్పాడని, ఆ కేసుని ఎలాంటి బేస్ లేకుండా ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? అనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థపై ఈ అసహనాన్ని సైతం, ఓ చోట అభిమానంగా మార్చేస్తాడు దర్శకుడు. అది కూడా సరైన సమయంలో. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పై కొత్త నమ్మకానికి బీజం వేస్తాడు. దర్శకుడు చిన్న చిన్న విషయాల్ని కూడా తెలివిగా వాడుకొన్నాడు. ఉదాహరణకు బంగారపు గొలుసు. కూతురుకి రెండు బుజ్జి పసి పాదాలున్న లాకెట్ తో గొలుసు చేయిస్తాడు సెల్వ. చివరి సీన్ కూడా ఆ పాద ముద్రల దగ్గరే ముగుస్తుంది. కొన్ని పాత్రలు అనవసరంగా తచ్చాడుతున్నాయి, అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆయా పాత్రలకు ఇచ్చిన ముగింపు సైతం అర్థవంతంగా సాగుతుంది. ముఖ్యంగా పోలీస్ ఇన్ఫార్మర్ పాత్ర. ఇలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్ హృదయాల్ని మరింత బరువెక్కిస్తుంది. ఎంత ఎమోషన్ తో కథ మొదలైందో, అంతే ఫీల్‌తో ఈ సినిమా ముగిసిపోతుంది. ఒకే ఎమోషన్ని సినిమా మొత్తం క్యారీ చేయడం, ప్రేక్షకులకు ఎప్పటి కప్పుడు కొత్త ప్రశ్నలు వేయించి, చిక్కుముడుల్ని సరైన సమయంలో రివీల్ చేయడం ఈ విషయంలో కొత్త దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు.
విజయ్‌సేతుపతి తన సహజమైన నటనతో మహారాజ పాత్రకు వన్నె తీసుకొచ్చాడు. ఆ పాత్రని ఓ రకంగా ఆవాహన చేసుకొన్నాడు. తన మొండితనం, కూతురిపై ప్రేమ, పగతో రగిలిపోయే తత్వం.. ఇవన్నీ చాలా అద్భుతంగా ఒలికించాడు. 50 సినిమాలతో నేర్చుకొన్న మొత్తం ప్రావీణ్యం ఈ సినిమాలో చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. తన కెరీర్లో ఇది కచ్చితంగా మైల్ స్టోన్ అనదగిన పాత్రే. అనురాగ్ కాశ్యప్ సాధారణమైన పాత్రల్ని ఒప్పుకోడు. తను చేశాడంటేనే ఆ పాత్రలో ఏదో విషయం ఉందనే లెక్క. సెల్వ పాత్ర మొదలైన తీరు, అది పరుగులు పెట్టిన పద్ధతి, ముగించిన విధానం మూడూ మూడు భిన్న కోణాల్లో సాగుతుంది. మమతామోహన్ దాస్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అభిరామి మెప్పిస్తుంది. భారతీరాజా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రధాన పాత్రలతో ఆ పాత్రకున్న ఎమోషన్ని ఇంకా బాగా కనెక్ట్ చేయాల్సివుంది. ఎందుకంటే అక్కడున్నది భారతీరాజా కాబట్టి. ఇతర పాత్రధారులంతా తమ సహజమైన నటనతో ఈ కథకు ప్రాణం పోశారు.
ఇది ముమ్మాటికీ దర్శకుడి సినిమా. తను స్టార్ బలాన్ని నమ్మలేదు. కేవలం కథని నమ్మాడు. ఇలాంటి కథలో ఎవరు చేసినా ఇంతే ఉత్తమమైన ఫలితం వస్తుందేమో. విజయ్‌సేతుపతి, అనురాగ్ కాశ్యప్ లాంటి వాళ్లు ఉండడం వల్ల ఈ సినిమాకు మరింత కళ అబ్బింది. స్క్రీన్ ప్లే విషయంలో ఈ సినిమా ఓ పాఠంగా మిగిలిపోతుంది. కథలో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని పండించిన విధానం ఆకట్టుకొంటుంది. నేపథ్య సంగీతం యాక్షన్నీ, ఎమోషన్ని బాగా ఎలివేట్ చేశాయి. పాటల జోలికి వెళ్లకపోవడం మంచిదైంది. హింస ఎక్కువైనా, అది ఇలాంటి కథకు అవసరమే అపిస్తుంది. ఖైది తరవాత ఓ డబ్బింగ్ సినిమా ఇంతగా ఇంపాక్ట్ కి గురి చేయడం ఇదేనేమో. నటీనటులు, స్క్రిప్ట్, సాంకేతిక విభాగం అన్నీ పకడ్బందీగా పని చేస్తే ఎలాంటి అవుట్ పుట్ వస్తుంది అనడానికి ఈ సినిమా ఓ నిదర్శనంగా నిలుస్తుంది.
తెలుగు360 రేటింగ్ 3/5