హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజుల వ్యవధిలోనే మరో రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొచ్చింది. జమిలీ ఎన్నికలు చాలా అవసరమని చెబుతున్న ఈసీ అవసరం ఉన్న చోట్ల కూడా ఆయా రాష్ట్రాల ఎన్నికలను కలసి నిర్వహించడం లేదు. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు నవంబర్ మొత్తం రాజకీయాలను డామినేట్ చేయనున్నాయి.
మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నవంబర్ 20న పోలింగ్.. 23న తేదీన కౌంటింగ్ ఉంటుంది. జార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు. నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో పోలింగ్, నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మార్క్ రాజకీయాన్ని ఇప్పటికే పూర్తి చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్ని బీజేపీ చీలికలు పేలికలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో రెండు శివసేనలు, రెండు ఎన్సీపీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ కూటముల్లో శివసేన, ఎన్సీపీలు ఉన్నాయి. ఈ రాజకీయంతో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు.
ఇక జార్ఖండ్‌పై ఈడీ ప్రయోగాన్ని ఇంతకు ముందే బీజేపీ పూర్తి చేసింది. సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ చేత అరెస్టు చేయించింది. ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత బెయిల్ పై విడుదలై మళ్లీ సీఎం అయ్యారు. ఓట్ల చీలిక ద్వారా ఈ సారి హేమంత్ సోరెన్ ను ఓడించాలని బీజేపీ అనుకుంటోంది. కానీ హేమంత్ సోరెన్ అరెస్టుతో ఆయనపై సానుభూతి పవనాలు ఉంటాయని..మరోసారి కాంగ్రెస్ కూటమిదే విజయమని ఆ పార్టీ నేతలు అంచనాకు వస్తున్నారు.