రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అటూ ఇటూ మారి ఉత్కంఠకు గురి చేసినా సగం కౌంటింగ్ అయ్యే సరికి పిక్చర్ క్లారిటీ వచ్చేసినట్లయింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ మెజార్టీ ఖాయమయింది. కాంగ్రెస్ , ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్దవ్ ధాకరే పార్టీల కూటమి దారుణంగా దెబ్బతిన్నది. ఈ రెండు పార్టీలను చీల్చి అసలు పార్టీలుగా మార్చుకున్న అజిత్ పవార్, శిందే పార్టీలు మంచి ఫలితాలు సాధించాయి. బీజేపీతో కలిసి భారీ మెజార్టీతో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నాయి.
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే అందులో220 వరకూ బీజేపీ కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదు కానీ పోటీ చేసిన మెజార్టీ స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. ఆ పార్టీకి 110కిపైగా స్థానాలు వస్తాయి. అందువల్ల బీజేపీ తరపునే ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న షిండే .. ఉపముఖ్యమంత్రితో సరి పెట్టుకోవచ్చు.
ఇక జార్ఖండ్లో మొదట్లో బీజేపీ ఆధిక్యం కనిపించింది. కానీ కౌంటింగ్ ముందుకు సాగే కొద్దీ.. జేఎంఎం కూటమి ఆధిక్యం సాధించింది. మొత్తం 81 సీట్లు ఉన్న జార్ఖండ్ కూటమిలో కనీసం 50 సీట్లను కూటమి సాధించే అవకాశం ఉంది. ఈ కూటమిలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎంతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడం వల్ల ఆయనకు సానుభూతి కలసి వచ్చిందని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఓ రకంగా.. తర్వాత మరో రకంగా ఉంటున్నాయి. ఇప్పుడు సగానికిపైగా కౌంటింగ్ పూర్తయినందున ఫలితాలు తిరగబడే అవకాశం తక్కువ అనుకోవచ్చు.