మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని తెలుస్తోంది. పేరెన్నికగన్న సంస్థ ఏకపక్షంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం లేదు. అయితే గతంలో మంచి పేరు తెచ్చుకున్న కొన్ని సంస్థలు ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో పోరు హోరాహోరీగా ఉందని ఎవరైనా కొద్దిలో బయటపడతారని అంటున్నాయి. మైయాక్సిస్ ఇండియా జార్ఖండ్లో ఇండియా కూటమికి అధికారం వస్తుందని అంచనా వేసింది. అయితే ఫలితాలు తారుమారు కావొచ్చు. తుది పోలింగ్ పర్సంటేజీని బట్టి ఖరారవుతుంది.
దేశంలో ఇప్పుడు రెండు రకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ఓ వర్గానికి ఎలాంటి నెట్ వర్క్ ఉండదు. లాటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేస్తూ ఉంటారు. వారి ఊహాలకు తగ్గట్లుగా ఫలితాలు వస్తే ఆహా మేమే చెప్పాం అంటూంటారు. అలాంటి వారంతా పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో అందరి ఎగ్జిట్ పోల్స్ తప్పు అయ్యాయి. దీంతో ఈ సారి అందరూ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పేశారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు, ఫలితాలను అంచనా వేయడం కష్టమని పోల్ పండితులు ఎప్పుడో తేల్చారు. ఎందుకంటే.. అక్కడ రాజకీయాలు పూర్తిగా ఆరు పార్టీల మధ్య చీలిపోయాయి. రెండు శివసేన, రెండు ఎన్సీపీ పార్టీలు రెండు ప్రధాన పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఓటర్లు ఎలా స్పందిస్తారో కానీ.. ఈ సారి కూడా ఎగ్జిట్ పోల్స్ పరువును ఫలితాలు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.