ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 21వ తేదీ లోపు.. చంద్రబాబుతో పాటు మరో పధ్నాలుగు మందిని… ధర్మాబాద్ కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. నిజానికి ఈ కేసు ఎనిమిదేళ్ల కిందటిది. అప్పట్నుంచి ఒక్క నోటీసు కానీ.. మరో వాయిదా కానీ లేని ఒక్క సారిగా ఎందుకు బయటకు వచ్చింది…? పదే పదే నోటీసులు జారీ చేసినట్లు కోర్టు రికార్డుల్లో ఎలా నమోదయింది…? నోటీసులు జారీ చేస్తే.. ఆ పధ్నాలుగు మందిలో ఒక్కరికి కూడా ఎందుకు రాలేదు..?. ఇలాంటి అనుమానాలు ప్రతి ఒక్కరి మదిలో రావడం సహజమే. వస్తున్నాయి కూడా..! దానికి కారణం.. చంద్రబాబుపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు ధోరణే.
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా… ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో వ్యవహారం ఉప్పు-నిప్పులా ఉంటుంది. ఈ ఫడ్నీవీస్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అనుంగు అనుచరుడు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా ఉంది. దానికి తోడు.. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతిస్తోంది. ముందస్తు ఎన్నికలు రావడానికి … సీక్రెట్‌గా ఎంత వేగంగా పనులు చేయాలో.. అంతా చేసి పెట్టింది. అటు మోడీ.. ఇటు కేసీఆర్.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సమయంలో… వారికి ఉమ్మడి టార్గెట్‌గా చంద్రబాబు మారారు. విభజన హామీల కోసం మోడీకి చంద్రబాబు ఎదురుతిరగడంతో… ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇక తెలంగాణలో మహాకూటమిని చంద్రబాబే మ్యానేజ్ చేస్తున్నాడనే భావనలోకేసీఆర్ ఉన్నారు. అందుకే ఇద్దరి టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు అయ్యారనే ప్రచారం ఉంది.
రాజకీయ ప్రత్యర్థుల్ని కేసులతో వేటాడటం అనేది.. అటు ఢిల్లీలో మోడీ.. ఇటు తెలంగాణలో కేసీఆర్… హాబీగా పెట్టుకున్నారు. కేంద్రంలో రాబర్ట్ వాధ్రా దగ్గర్నుంచి శశికళ వరకూ..ఎంతో బాధితులు ఉన్నారు. అదే సమయంలో.. మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ లాంటి వాళ్లు సేఫ్‌గా బయటే ఉన్నారు. ఇక తెలంగాణలో.. ఇటీవలి కాలంలో ఎన్ని అరెస్టులు.. ఎన్ని నోటీసులు వచ్చాయో.. చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఉమ్మడి టార్గట్‌గా ఉన్న చంద్రబాబును కార్నర్ చేయడానికి మహారాష్ట్రలో నమోదైన కేసును.. వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. సీబీఐ ద్వారానో..మరో కేంద్ర సంస్థ ద్వారానో నోటీసులిస్తే.. నేరుగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నామనే విమర్శలు వస్తాయి కాబట్టి.. కోర్టు ద్వారా ఆ పని చేయిస్తే.. తాము సమర్థించుకోవచ్చని… భావించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును కోర్టుకు లాగానే… ఇద్దరు శత్రువుల ప్రయత్నం నెరవేరుతుందో లేదో చూడాలి..!