మహారాష్ట్రలో రాజకీయ మంటలు ఓ రేంజ్లో వస్తున్నాయి. మరాఠా కోటా పేరుతో అక్కడ రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైంది. చివరికి తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయడం ప్రారంభమయింది. మరాఠా ఉద్యమ నాయకుడు ఆమరణదీక్ష కూడా ప్రారంభించారు. మరో వైపు ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తామని చెబుతున్నారు. ఈ మరాఠా కోటా గురించి ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం షిండే చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది.
ఓ వైపు ఇలా మరాఠా కోటా రచ్చ ఓ వైపు జరుగుతూండగానే… గతంలో పార్టీ ఫిరాయించిన వ్యవహారంలో ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు అంశం తేల్చాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు పదే పదే గడువు నిర్దేసిస్తోంది. డిసెంబర్ చివరిలోపు నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ఆదేశించింది. పార్టీ ఫిరాయిపుల నిరోధక చట్టం ప్రకారం… అనర్హతా వేటు పడుతుందన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ప్రభుత్వం మనుగడ సాగించడం గగనం అవుతుంది.
ఈ పరిణామాలన్నీ కలిసి.. లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మామూలుగా అయితే మహారాష్ట్ర ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్లో జరగాల్సి ఉంది. కానీ రాజకీయ అనిశ్చితి కారణంగా పార్లమెంట్ తో పాటే పెట్టేసేందుకు ప్లాన్ లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాలు అక్కడి ప్రజల్లో వినిపిస్తోంది.