మహారాష్ట్రలోని శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ ప్రభుత్వం ఎన్నికలు బ్యాలెట్‌తోనే జరపాలని నిర్ణయానికి వచ్చింది. ఈవీఎంలు ఉపయోగించకూడదన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకే అసెంబ్లీలో ఏకంగా చట్టం తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా చేసి బిల్లు రూపొందించారు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించాలా వద్దా అన్నది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దేశ స్థాయిలో ఎన్నికలు జరగాలంటే.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి.
అందుకే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినంత వరకూ చట్టంలో ఎలాంటి అంశాలు పొందు పరచకుండా… కేవలం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించాలన్న చట్టాన్ని మహారాష్ట్ర సర్కార్ చేయనుంది. ఈవీఎంల విషయంలో ఒక్క బీజేపీ మినహా మరే పార్టీకి నమ్మకం లేకుండా పోయింది. ఒక్కో చోట అసాధారణంగా ఫలితాలు వస్తూండటం… ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడటానికి కారణం అవుతోంది. నిన్నామొన్నటి వరకూ బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఇప్పుడు… బీజేపీ పైనే అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఈవీఎంల మ్యానిపులేట్ జరుగుతోందని అనుమానిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేస్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించే.. అసెంబ్లీ చట్టం చేస్తుంది కాబట్టి పాటిస్తుందా లేదా.. అన్నది కీలకం. పాటించకపోతే.. వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించి అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్లతో నిర్వహించేదుకు ఈసీ ఒప్పుకోకపోవచ్చు. ఈవీఎంల విషయంలో వెనక్కి తగ్గేది లేదని బీజేపీ అదే పనిగా ప్రకటనలు చేస్తోంది.