ఒక పక్క ఉగ్రవాద దాడులకు సంబంధించిన వార్తలు, మరో పక్కన దేశ రాజకీయాల్లోని సంచలన వార్తల మధ్య సమాజానికి పనికొచ్చే మఖ్యమైన వార్తను చాలామంది గమనించి ఉండకపోవచ్చు. అది సంఘ బహిష్కరణకు సంబంధించిన వార్త. టీవీలు పెద్దగా పట్టించుకోని వార్త. కానీ దేశ సమాజాభివృద్ధికి చాలా అవసరమైన వార్త.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67ఏళ్లు అయినప్పటికీ, చాలా ఊర్లలో సంఘ బహిష్కరణ ఓ కట్టుబాటుగా సాగిపోతోంది. కులకట్టుబాట్ల పేరిట అత్యంత దారుణాలు జరిగిపోతున్నాయి. ఊరి కట్టుబాట్లు, కులపంచాయతీలు గ్రామస్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. హింసాత్మక సంఘటనలు సరేసరి. ఈ విషసంస్కృతిపై ఏనాడో చట్టపరంగా పంజావిసరాల్సింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలోని మిగతారాష్ట్రాలకంటే ముందంజవేసింది. తన ప్రభుత్వ వెబ్ సైట్ (www.maharashtra.gov.in)లో ‘Maharashtra Prohibition of Social Boycott Act, 2015’ బిల్లు ముసాయిదా ప్రతిని ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచింది. సంఘ బహిష్కరణను నిషేధించాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ బిల్లుని త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లుకు చట్టబద్ధత వస్తుంది.
ఈ చట్టం అమల్లోకి వస్తే….
1. దోషులుగా నిర్థారణ అయితే, ఐదు లక్షల రూపాయలవరకు జరిమానా, ఏడేళ్ళ జైలుశిక్ష గానీ లేదా రెండూ కలిపిగానీ విధించేందుకు వీలుచిక్కుతుంది.
2. ఛార్జిషీట్ సిద్ధమయ్యాక ఆరునెలల్లో కేసు విచారణ పూర్తిచేయాలి.
3. `కుల పంచాయితీ’ -అన్న మాటకు ఈ ముసాయిదా ప్రతి వివరణ ఇచ్చింది. ఏ కులానికి చెందిన వారైనా కమిటీగా (కూటమిగా) ఏర్పడి (ఆ కమిటీ రిజిస్టర్డ్ అయినా కాకపోయినప్పటికీ) కుల పంచాయితీ పేరిట కట్టుబాట్ల ఆధారంగా విచారణ చేపట్టడం, మౌఖికంగాగానీ, లేదా లిఖితపూర్వకంగా గానీ నిర్ణయాలు తీసుకోవడం, తీర్పులు చెప్పడం .
4. ఈ చట్టం క్రింద నమోదయ్యే కేసుల్లో నిందితులకు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది.
5. మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ లేదా జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) ఈ కేసు విచారణ చేపట్టవచ్చు.
6. సంఘబహిష్కరణ నిషేధిత కార్యనిర్వాహకాధికారిని నియమించే సౌకర్యం ఈ చట్టం కల్పిస్తుంది. ఈ అధికారి ఇటు పోలీసులకు, అటు మెజిస్ట్రేట్ కి అవసరమైనప్పుడు సహకారం అందిస్తుంటారు.
మహారాష్ట్రలో ఈమధ్య కులకట్టుబాటు క్రింద వెలివేసిన సంఘటనలు ఎక్కవయ్యాయి. ఒక్కోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇది తప్పన్నవారిపై దాడులకు పాల్పడి చంపేసిన సంఘటనలు కూడా జరిగాయి. దీంతో చాలామంది సామాజిక కార్యకర్తలు వెలిని నిషేధించాలంటూ అనేకసార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా చట్టాన్ని తీసుకురావడంలోనే కాదు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడంలో కూడా మిగతా రాష్ట్రాలకంటే ముందంజ వేయడం గమనార్హం.
బిల్లు లక్ష్యం మంచిది కావడంతో పలువర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే, బెయిలబుల్ అన్నది నాన్ బెయిలబుల్ గా మార్చాలని చాలామంది సూచిస్తున్నారు. మహారాష్ట్రలో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ తరహా చట్టాలు రావాలని సామాజిక కార్యకర్తలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
– కణ్వస