మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసింది. రాష్ట్రపతి పాలన ఖాయమనుకుంటున్న దశలో.. చివరి క్షణల్లో గవర్నర్ కోషియారీ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. బీజేపీ ఎలాంటి లేఖ ఇవ్వకపోయినప్పటికీ.. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర రాజ్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినందుకు.. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. 288 స్థానాలున్న అసెంబ్లీలో బీజే్పీకి 105 మాత్రమే సీట్లు ఉన్నాయి. 145 స్థానాలు మ్యాజిక్ మార్క్. కలసి పోటీ చేసిన శివసేన బీజేపీకి మద్దతివ్వడానికి సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి పదవిపై హామీ కోరుతోంది. దీంతో.. ప్రతిష్టంభన ఏర్పడింది.
శివసేన కేవలం 56 స్థానాలతో సీఎం పదవిపై పెట్టుకున్న ఆశలు వదులుకునేందుకు సిద్ధపడటం లేదు. అందుకే.. శుక్రవారమే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర కోటలో శివసేన సీఎంను కూర్చోబెట్టడమే తమ లక్ష్యమన్నారు. శివసేన కొన్ని ఆప్షన్స్ వెదుక్కుంటోది కూడా. బీజేపీ కశ్మీర్లో పీడీపీతో జత కట్టినప్పుడు తాము ఎన్సీపీతో చేతులు కలిపితే తప్పేమిటని ఉద్ధవ్ ప్రశ్నిస్తున్నారు. శివసేన ఇప్పటికే మహారాష్ట్ర ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెస్తోంది. శివాజీ వారసత్వాన్నే శివసేన గుర్తుచేస్తోంది. మరాఠా ఆత్మగౌరవం నిలబడాలంటే శివసేన నుంచి సీఎం ఉండాలన్నట్లుగా సేన ప్రచారం చేస్తోంది. ఇదీ తమ చిరకాల వాంఛ అని కూడా బహిరంగంగానే చెబుతోంది.
సోమవారమే బలనిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్‌కు.. గవర్నర్ ఆదేశించారు. అయితే.. బలపరీక్ష నెగ్గడం అంత సులువైన విషయం కాదు. సొంతంగా.. మెజార్టీ లేదు. కనీసం నలభై మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఏం చేస్తారనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెర వెనుక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా… అన్న కోణంలో.. అందరూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వైపు చూస్తున్నారు. సోమవారం కచ్చితంగా.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ ట్విస్ట్ చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.