హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు శ్రీమంతుడు చిత్రంద్వారా అభిమానులకు ఒక స్వీట్ షాక్ ఇచ్చారు. తాజాగా ట్విట్టర్లో ఆయన ఒక స్టిల్ విడుదల చేశారు. దానిలో ఫక్తు పల్లెటూరి కుర్రాడిలాగా లుంగీ ఎగగట్టి కనిపిస్తున్నారు మహేష్. తెల్లగా, అందంగా, నాజూకుగా, అల్ట్రా సివిలైజ్డ్లాగా కనిపించే మహేష్‌ను ఒక్కసారిగా ఈ గెటప్‌లో చూసేసరికి అందరి ముఖాలలో నవ్వులు విరబూస్తున్నాయి. ట్విట్టర్లో మహేష్కూడా అదే పేర్కొన్నారు. సినిమాలోని వినోద సన్నివేశాలలో ఇదొకటని, తనకు ఇది ఎంతో నచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ స్టిల్‌లో లంగీ కట్టి స్లిప్పర్స్‌తో మహేష్ నడుస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు అతనిని అనుసరిస్తుండగా, మరో ఇద్దరు కుర్రాళ్ళు, అరుగులమీద కూర్చున్న ఇద్దరు ఆడవాళ్ళు మహేష్‌ను కొత్తగా చూస్తున్నారు. మన ఊర్లలోకి వెళితే కుర్రాళ్ళు ఇలాగే లుంగీలు ఎగగట్టి కనిపించటం సర్వసాధారణమే. అదే ఇన్ఫార్మల్ లుక్‌లో మహేష్ కనిపిస్తున్నారు. సినిమా ప్రోమోలనుబట్టి శ్రీమంతుడైన మహేష్ ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ స్థితిగతులను మారుస్తాడని మనం ఊహించుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ లుంగీ స్టిల్ అయిఉండొచ్చు. మరోవైపు ఈ సినిమా ఆడియో ఇప్పటికే బ్రహ్మాండంగా సక్సెస్ కావటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘జతకలిసే’ పాట మెలోడీగా ఉండి బాగా ఆకట్టుకుంటోంది.