బ్రహ్మోత్సవం, స్పైడర్.. రెండూ మామూలు ఫ్లాపులు కాదు. మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్నే అతలాకుతలం చేసేశాయి. నిర్మాతల్ని రోడ్డుపైకి తీసుకొచ్చేశాయి. ఇంతటి పెద్ద ఫ్లాపుల్ని మహేష్ ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి సమయంలో `భరత్ అనే నేను` వచ్చి సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ విజయంతో మహేష్ మొహం ఇది వరకటిలా కళకళలాడిపోతోంది. `భరత్ అనే నేను` సక్సెస్ మీట్లో మహేష్ చాలా జోవియల్గా కనిపించాడు. ”రెండేళ్లుగా నా సినిమాలు సరిగా ఆడలేదు. అభిమానుల్ని నిరుత్సాహపరిచాను. శ్రీమంతుడు సమయంలోనూ ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే ఉన్నాను. ఇలాంటి సమయంలో భరత్ అనే నేను విజయం చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా కోసం పడిన కష్టం ఏ చిత్రానికీ పడలేదు. 50 రోజులు నాన్ స్టాప్ గా పనిచేశాం. బాగా అలసిపోయాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక. కుటుంబంతో కలసి ఎక్కడికో వెళ్లిపోయా. అక్కడ కూడా నాకు సినిమాకి సంబంధించిన టెన్షనే. కొరటాలకు, దేవికి ప్రతీ గంటకూ ఫోన్ చేస్తుండేవాడ్ని” అంటూ తన కష్టం గురించి చెప్పుకొచ్చాడు మహేష్. హిట్లూ, ఫ్లాపులూ తనకు కొత్త కాదని, అలవాటైపోయిందని, అయితే భరత్ అనే నేను లాంటి సినిమాల్ని మాత్రం తన లైబ్రరీలో దాచుకుని, పిల్లలకు వాళ్ల పిల్లలకు గర్వంగా చూపించుకుంటానని మహేష్ చెప్పాడు.