ఈమధ్య ఏ ఆల్బమ్కీ రానంత నెగిటీవ్ రెస్పాన్స్ ‘మహర్షి’కి వచ్చింది. ఈ పాటల్ని మహేష్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం మొదలెట్టారు. దేవిశ్రీ తన స్థాయికి తగిన ఆల్బమ్ ఇవ్వలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. చిత్రబృందానికీ అభిమానుల బాధ అర్థమైంది. కానీ ఇప్పుడేం చేయలేరు కదా? అందుకే దేవి ట్యూన్స్‌ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎవ్వరూ.. ‘ఈ పాట బాగుంది.. ఈ పాట అదిరిపోయింది’ అనలేదు. చాలా క్యాలిక్లేటెడ్గా మాట్లాడారు. ‘ఇలాంటి సినిమాలకు పాటలు చేయడం చాలా కష్టం. ఓ స్టార్ హీరో సినిమాకి నాలుగు మాంటేజ్ పాటలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ పాటలు థియేటర్లో దద్దరిల్లిపోతాయి’ అని దేవి పనితనాన్ని దిల్‌రాజు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. వంశీ పైడిపల్లిదీ ఇదే దారి. మహేష్ బాబు అయితే… దేవి ఇచ్చిన పాటల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. కేవలం ఆర్.ఆర్. గురించి మాత్రమే మాట్లాడాడు. దేవీ ఆర్.ఆర్ అదరగొట్టేశాడని కితాబిచ్చాడు. ”దేవి సంగీత దర్శకుడైతే నేను రిలాక్స్ అయిపోతాను. ఆర్.ఆర్ విషయంలో నాకెలాంటి బెంగ ఉండదు” అన్నాడు మహేష్ బాబు.
ఈ పాటలు వినడానికి అంతంతమాత్రంగానే ఉన్నా, థియేటర్లో సన్నివేశానికి తగ్గట్టుగా కుదిరి ఆకట్టుకుంటాయన్నది చిత్రబృందం నమ్మకం. ఇప్పటి వరకూ విడుదల చేయని పాటొకటి ఉంది. ఆ పాటపై కూడా చిత్రబృందం గట్టిగా నమ్మకాలు పెట్టుకుంది. మరి.. దిల్‌రాజు నమ్మకం నిజం అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మే 9 వరకూ ఆగాల్సిందే.